రంగారెడ్డి, జూన్ 17, (నమస్తే తెలంగాణ);ప్రభుత్వ బడుల బలోపేతానికి సర్కార్ తీసుకుంటున్న చర్యలు ఫలిస్తున్నాయి. ‘మన ఊరు-మన బడి’తో గవర్నమెంట్ స్కూళ్లు ప్రైవేటుకు దీటుగా రూపుదిద్దుకుంటున్నాయి. సకల సౌకర్యాలు కల్పించడం, 1 నుంచి 8 తరగతుల వరకు ఇంగ్లిష్ మీడియం బోధనను ప్రవేశపెట్టడంతో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కార్ బడుల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 5,485 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరగా.. ఇందులో 1934 మంది ప్రైవేటు స్కూళ్ల నుంచి వచ్చినవారున్నారు. ఉచితంగా పాఠ్య పుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం అందిస్తుండడంతో ప్రభుత్వ బడులకు క్యూ కడుతున్నారు. ప్రైవేట్ స్కూళ్లలో భారీగా ఫీజులు వసూలు చేస్తుండడం, అర్హతలేని ఉపాధ్యాయులతో బోధన చేయిస్తుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలకే జై కొడుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తీసుకువచ్చిన మన ఊరు-మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ బడుల్లో సమూల మార్పు వస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తుండడంతోపాటు ఇంగ్లిష్ మీడియంను అమల్లోకి తీసుకువచ్చారు. జిల్లావ్యాప్తంగా 1309 ప్రభుత్వ పాఠశాలలుండగా, వీటిలో మొదటి విడుతలో 464 స్కూళ్లలో మౌలిక సదుపాయాలను కల్పించే పనులను చేపట్టారు. ప్రభుత్వ స్కూళ్లు కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా రూపుదిద్దుకుంటున్నాయి. దీంతో సర్కారు బడుల్లో కొత్తగా చేరే విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది.
ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమం అమలు చేయడం, మౌలిక సదుపాయాలను కల్పించడంతోపాటు డిజిటల్ బోధన అందించేందుకు అధికారులు ప్రణాళిక చేపట్టారు. పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, పుస్తకాలు, స్కూల్ డ్రెస్సులు కూడా ఉచితంగా అందిస్తుండడం, పదో తరగతి పరీక్షల్లో ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు, విద్యార్థుల దత్తత తదితర కార్యక్రమాలతో మెరుగైన ఫలితాలు సాధిస్తుండడం వంటి కసరత్తును అమలుచేస్తున్నారు.
ఇప్పటివరకు కొత్తగా చేరిన 5485 మంది విద్యార్థులు
రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు -మన బడి కార్యక్రమంతో చేపట్టిన కార్యక్రమాలతో ప్రభుత్వ పాఠశాలలకు క్యూ కడుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 5485 మంది విద్యార్థులు కొత్తగా చేరారు. వీరిలో ప్రీ ప్రైమరీ తరగతులకు సంబంధించి 44 మంది విద్యార్థులు, అంగన్వాడీ కేంద్రాల నుంచి 1933 మంది విద్యార్థులు, ప్రైవేట్ స్కూళ్ల నుంచి 1934 మంది విద్యార్థులు, ఒకటో తరగతికి 3530 మంది విద్యార్థులు కొత్తగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. ప్రైవేట్ స్కూళ్లలో భారీగా ఫీజులు వసూలు చేస్తుండడంతోపాటు అర్హతలేని ఉపాధ్యాయులుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలవైపు మొగ్గు చూపుతున్నారు.
కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా వసతులుండడం, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులుండడం, నాణ్యమైన విద్యనందిస్తుండడంతో ప్రభుత్వ పాఠశాలల్లో చేరే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. ఈ నెల 3 నుంచి జిల్లాలో నిర్వహిస్తున్న బడిబాట కార్యక్రమంలో భాగంగా స్కూళ్ల వారీగా విద్యార్థుల సంఖ్యను పెంచేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ సర్వే, ర్యాలీలు నిర్వహించి, కరపత్రాలను పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో బడీడు పిల్లలను చేర్పించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం, ఇంగ్లిష్ మీడియం, మౌలిక వసతులపై తల్లిదండ్రులకు తెలియజేస్తున్నారు. బాల కార్మికులను గుర్తించి పాఠశాలల్లో చేర్పిస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలలకు మంచి రోజులు
– సుశీందర్రావు, జిల్లా విద్యాశాఖ అధికారి
రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన మన ఊరు -మన బడితో ప్రభుత్వ పాఠశాలలకు మంచిరోజులు వచ్చాయి. సర్కారు బడుల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు ఆంగ్ల మాధ్యమాన్ని ఈ విద్యాసంవత్సరం నుంచి అమల్లోకి తీసుకురావడంతో ప్రైవేట్ స్కూళ్ల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా చేరుతున్నారు. సర్కారు బడుల్లో చేపట్టిన పనులతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తున్నది.