వరిసాగులో వెదజల్లె పద్ధతిని ప్రోత్సహించే దిశగా వికారాబాద్ జిల్లా వ్యవసాయ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ విధానంలో పెట్టుబడి ఖర్చు తగ్గడంతోపాటు నీరు కూడా ఆదా కానుండడంతో దీనిపై దృష్టి సారించారు. ఈ వానకాలంలో ప్రతి క్లస్టర్ పరిధిలో 50 ఎకరాల్లో వెదజల్లే పద్ధతిలో వరి సాగుకు నిర్ణయించగా.. జిల్లావ్యాప్తంగా 4,950 ఎకరాల్లో సాగు చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. వెదజల్లె పద్ధతి వలన కలిగే ప్రయోజనాలపై వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ విధానంలో ఎకరాకు రూ.7వేల నుంచి రూ.8వేల వరకు పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయని సూచిస్తున్నారు.
పరిగి, జూన్ 17 : జిల్లాలో ప్రతి క్లస్టర్ పరిధిలో 50 ఎకరాల్లో ఈ పద్ధతిలో సాగుకు అధికారులు నిర్ణయించారు. ఈ వానకాలంలోనే సాగుకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నారు. వికారాబాద్ జిల్లా పరిధిలో వానకాలంలో 88200 ఎకరాల్లో వరి సాగు చేపడుతారని వ్యవసాయాధికారులు ప్రణాళికలు తయారు చేశారు. ప్రతి సంవత్సరం నార్లు పోసి, నాట్లు వేయించడం పద్ధతిలో వరి సాగు చేపడుతుండగా.. ఈసారి వడ్లు వెదజల్లే పద్ధతిలో సాగుకు అధికారులు ప్రోత్సాహం అందిస్తూ రైతులకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. జిల్లా పరిధిలో 4950 ఎకరాల్లో సాగు చేపట్టనున్నారు. జిల్లాలో 99 క్లస్టర్లు ఉండగా ఒక్కో క్లస్టర్‌కు 25 మంది రైతులను ఎంపిక చేసి 50 ఎకరాల్లో ఈ విధానంలో సాగు చేపట్టేందుకు కృషి చేయనున్నారు.
తగ్గనున్న పెట్టుబడి ఖర్చులు
వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేస్తే పెట్టుబడి ఖర్చులు చాలావరకు తగ్గుతాయని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. ఎప్పటిలాగే నాట్లు వేసే పద్ధతిలో వరి సాగుకు ఎకరాకు 25 నుంచి 30 కిలోల విత్తనాలు అవసరమవగా వెదజల్లే పద్ధతిలో 8 నుంచి 10 కిలోల విత్తనాలు సరిపోతాయి. కరిగెట చేసేందుకు ట్రాక్టర్ డ్రమ్‌లతో తిప్పించడం ఖర్చు, నాట్లు వేసేందుకు కూలీల ఖర్చు మిగిలిపోతుంది. దీంతో ఈ విధానంలో ఎకరాకు రూ.7వేల నుంచి రూ.8వేల వరకు పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయని అధికారులు సూచిస్తున్నారు. ఈమేరకు జిల్లావ్యాప్తంగా ప్రతి క్లస్టర్‌వారీగా వరి సాగు చేసే రైతులతో వ్యవసాయాధికారులు సమావేశాలు జరిపి వెదజల్లే విధానంలో వరి సాగుపై శిక్షణ ఇవ్వనున్నారు. తద్వారా రైతులకు అవగాహన పెంపొందనుంది. కూలీల సమస్య లేకుండానే సమయానుకూలంగా ఈ విధానంలో వరి సాగు చేపట్టవచ్చు. అలాగే సుమారు 10రోజుల ముందుగానే ఈ విధానంలో పంట చేతికొస్తుంది. రెండో పంట వేసుకునేందుకు కూడా అవకాశం కలుగుతుంది. ఈ విధానంతో 25 నుంచి 30 శాతం వరకు నీటి వాడకం తగ్గుతుందని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.
మరో మూడు కార్యక్రమాలు
జిల్లా పరిధిలో ఈసారి వానకాలంలో మరో మూడు కార్యక్రమాల అమలుకు వ్యవసాయాధికారులు నిర్ణయించారు. జిల్లాలోని 99 క్లస్టర్ల పరిధిలో 4950 మంది రైతులకు సంబంధించి 9,900 ఎకరాల్లో భాస్వరం కరిగించే బ్యాక్టీరియా వేయించాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఒక కిలో ఈ ఎరువుకు రూ.50 నుంచి రూ.100 చొప్పున ఖర్చవుతుండగా ఒక ఎకరానికి రెండు కిలోల చొప్పున ఈ బ్యాక్టీరియా వేసినట్లయితే ఎకరానికి సగం బస్తా డీఏపీ వాడకం తగ్గించవచ్చు. దీంతో ఎకరాకు రూ.600 వరకు రైతుకు పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది. దీంతోపాటు పచ్చిరొట్ట ఎరువులైన జనుము, జీలుగ వేయడం పెంచాలన్నది ప్రభుత్వ ఆలోచన. అందుకనుగుణంగా ఈసారి జిల్లాలో 2970 మంది రైతులకు సంబంధించి 14850 ఎకరాల్లో ఈ ఎరువుల వాడకం ద్వారా ఇతర రైతులు వీటి వాడకం వైపు ఆకర్షితులయ్యేలా కార్యక్రమం రూపొందించారు.
60 శాతం సబ్సిడీపై వ్యవసాయ శాఖ జనుము, జీలుగను అందజేస్తుంది. వరి వేసే ముందు రైతులు వీటిని వేయనున్నారు. దీంతోపాటు వివిధ దశల్లో మొక్కకు అవసరమైనప్పుడు ఎరువులు వేసే పద్ధతిపై అవగాహన కల్పించనున్నారు. ఇందుకుగాను జిల్లావ్యాప్తంగా 4950 మంది రైతులను ఎంపిక చేశారు. వారికి సంబంధించి 9900 ఎకరాల్లో ఈ విధానంలో రైతులు సాగు చేసిన పంటలకు ఏ దశలో, ఎంత మోతాదులో ఎరువు అవసరమో తెలియజేసి సంబంధిత రైతు ద్వారానే వేయిస్తారు. ఒకేసారి వేయకుండా మొక్కలకు ఏ దశలో ఆహారం అవసరముంటుందనేది తెలియజేసి.. అదే సమయంలో యూరియా, పొటాష్ వంటివి వేయించనున్నారు. ఇందుకు సంబంధించి జిల్లావ్యాప్తంగా రైతులను ఎంపిక చేసిన అధికారులు పూర్తిస్థాయిలో ఏఈవోల పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలను అమలు చేస్తారు. వీటిలో కొన్నింటిని మండల వ్యవసాయాధికారులు, సహాయ సంచాలకులు, జిల్లా వ్యవసాయాధికారి సైతం పర్యవేక్షిస్తుంటారు.
వెదజల్లే పద్ధతిలో వరి సాగుపై అవగాహన
– గోపాల్, జిల్లా వ్యవసాయాధికారి
విత్తనాలు వెదజల్లే పద్ధతిలో వరి సాగుపై అధికారులు రైతులకు అవగాహన కల్పించనున్నారు. ఈ విధానంలో పెట్టుబడి ఖర్చులు చాలావరకు తగ్గడంతోపాటు త్వరగా పంట చేతికి వస్తుంది. దీంతో రెండో పంట వేసుకునే అవకాశం ఉంటుంది. జిల్లాలోని 99 క్లస్టర్ల పరిధిలో 4950 ఎకరాల్లో ఈ పద్ధతిలో వరి సాగు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పద్ధతిలో సాగుతో ఎకరాకు రూ.7వేల నుంచి రూ.8వేల వరకు పెట్టుబడి తగ్గుతుంది.