షాద్‌నగర్, జూన్ 17 : కేంద్ర ప్రభుత్వం వెంటనే అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో శుక్రవారం ఆర్మీ అభ్యర్థులు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో షాద్‌నగర్ రైల్వేస్టేషన్ ఆవరణలో పోలీసులు ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు. పట్టణ సీఐ నవీన్‌కుమార్ ఆధ్వర్యంలో ఎస్ఐతో కూడిన ఆరుగురు పోలీస్ సిబ్బంది, రైల్వే పోలీస్ సిబ్బంది, పలువురు ప్రత్యేక పోలీస్ సిబ్బంది రైల్వే స్టేషన్ ఆవరణలో ఎలాంటి సంఘటనలు జరుగకుండా ఉదయం 10గంటల నుంచి సాయంత్రం వరకు బందోబస్తు నిర్వహించారు. ఇదిలా ఉంటే షాద్‌నగర్ పట్టణం మీదుగా రైళ్ల యథావిధిగా సాగాయి. రైల్వే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని రైల్వే అధికారులు తెలిపారు.
వికారాబాద్, జూన్ 17 : అగ్నిపథ్ ఆందోళన నేపథ్యంలో వికారాబాద్ రైల్వే స్టేషన్లో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఇందులోభాగంగా వికారాబాద్‌కు రైళ్లు రాకపోవడంతో.. ప్రయాణికులు లేక రైల్వేస్టేషన్ బోసిపోయి కనిపించింది.
శంకర్పల్లి, జూన్ 17 : శంకర్పల్లి రైల్వేస్టేషన్లో ఉదయం నుంచి శంకర్పల్లి సీఐ మహేశ్‌గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు పహరా నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగలేదని సీఐ తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐ సంతోష్‌రెడ్డి, ఎస్బీ జమేదార్ ఆనంద్, రైల్వేస్టేషన్ మేనేజర్ శ్రీకాంత్ పాల్గొన్నారు.
ఆందోళనలో కులకచర్ల యువకుడికి గాయాలు
కులకచర్ల, జూన్ 17 : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనలో ఓ యువకుడికి గాయాలయ్యాయి. శుక్రవారం ఉదయం కులకచర్ల నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లిన కులకచర్ల మండలం బొంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన దండు మహేశ్, సౌవుర్ల రఘు వెళ్లారు. పోలీసులు పేల్చిన రబ్బర్ బుల్లెట్‌తో దండు మహేశ్‌కు గాయాలుకాగా హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానలో చేర్పించారు. శనివారం డిశ్చార్జి చేయవచ్చునని మహేశ్ కుటుంబసభ్యులకు వైద్యులు తెలిపారు.