పరిగి, జూన్ 17 : గ్రామాలు పరిశుభ్రంగా, పచ్చదనంగా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని వికారాబాద్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పల్లె ప్రగతి, హరితహారంపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. హరితహారంలో భాగంగా రోడ్లకు ఇరువైపులా పెద్దఎత్తున మొక్కలను నాటేందుకు చర్యలు చేపట్టాలన్నారు. గుంతలు తవ్వించాలని చెప్పారు. తెలంగాణ క్రీడా ప్రాంగణాలకు స్థలాల సేకరణ శనివారం లోగా పూర్తి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. స్థల సేకరణ పూర్తయిన వెంటనే గ్రౌండింగ్ పనులు చేపట్టాలని ఎంపీడీవోలను కలెక్టర్ ఆదేశించారు. వైకుంఠధామాల్లో మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వి సిద్ధంగా ఉంచాలని చెప్పారు. విద్యుత్, నీటి సరఫరాకు సంబంధించిన పనులు వేగంగా చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేయాలని సూచించారు. వైకుంఠధామాల్లో చేపట్టే చిన్న పనులకు గ్రామపంచాయతీలు నిధులు ఇవ్వడానికి వీలుకాకపోతే అంచనాలు సిద్ధం చేసి అందించాలని కలెక్టర్ సూచించారు. కులకచర్ల మండలం హనుమాన్‌నాయక్ గ్రామపంచాయతీ కార్యదర్శి గ్రామంలో వైకుంఠధామానికి ప్రైవేటు వ్యక్తుల నుంచి భూమిని సేకరించినందుకు ఆయనను కలెక్టర్ అభినందించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఇన్చార్జి డీఆర్వో విజయకుమారి, జడ్పీ సీఈవో జానకీరెడ్డి, డీఆర్డీవో కృష్ణన్, డీపీవో మల్లారెడ్డి, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాస్‌రెడ్డి, మిషన్ భగీరథ ఈఈ బాబు శ్రీనివాస్, గిరిజన అభివృద్ధి శాఖ అధికారి కోటాజీ, ఉద్యాన శాఖ అధికారి చక్రపాణి, యువజన సంక్షేమ అధికారి హనుమంతరావు, మండలాల ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు.