రంగారెడ్డి, జూన్ 16 (నమస్తే తెలంగాణ): జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో గ్రీనరీ పెంపుపై జిల్లా అటవీశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. పర్యావరణాన్ని పెంచడంతోపాటు రాష్ర్టాన్ని ఆకు పచ్చని తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్ తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా అటవీ ప్రాంతాల్లో మొక్కలను నాటేందుకు అధికారులు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ ఏడాది కూడా అటవీ ప్రాంతాల్లో మొక్కలను నాటేందుకు ప్రణాళికను రూపొందించారు. వచ్చే రెండేండ్ల కాలంలో జిల్లాలోని అటవీ ప్రాంతాలను దట్టమైన అడవులుగా మార్చడమే లక్ష్యంగా చర్యలు తీసు కుంటున్నారు. అయితే రంగారెడ్డి జిల్లాలో 509 హెక్టార్లలో మొక్కలు లేకుండా ఖాళీగా ప్రాంతాలు ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు.
ఆ ప్రాంతాల్లో మీటరుకు ఒక మొక్క చొప్పున నాటేందుకు చర్యలు చేపట్టారు. జిల్లాలోని ఆమనగల్లు, శంషాబాద్ డివిజన్లలోని 83 బ్లాకుల్లో ఇప్పటికే ఖాళీ ప్రాంతాలను గుర్తించిన జిల్లా అటవీ శాఖ అధికారులు ఆ ఖాళీ స్థలాల్లో 50 లక్షల మొక్కలను నాటేందుకు సన్నద్ధమవుతున్నారు. ఆ ప్రాంతాల్లో నెమలినార, కానుగ, రావి, అల్లనేరేడు, మర్రి, చింత, శ్రీగంధం, వేప, టేకు, సీతాఫల్, ఉసిరి, మారేడు, జిల్లేడు తదితర ఔషధ మొక్కలను నాటనున్నారు. రంగారెడ్డి జిల్లాలో 29,282 హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉండగా, ఆమనగల్లు రేంజ్ పరిధిలో 4,195 హెక్టార్లు, ఇబ్రహీంపట్నం రేంజ్ పరిధిలో 8,631 హెక్టార్లు, కందుకూరు రేంజ్ పరిధిలో 8,604 హెక్టార్లు, చిలుకూరు రేంజ్ పరిధిలో 1,304 హెక్టార్లు, హయత్నగర్ రేంజ్ పరిధిలో 2,116 హెక్టార్లు, మంఖాల్ పరిధిలో 3,069 హెక్టార్లు, శంషాబాద్ రేంజ్ పరిధిలో 1,563 హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది.
ఈ ఏడాది లక్ష్యం కోటి మొక్కలు..
జిల్లాలో ఎనిమిదో విడుత హరితహారానికి జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమం లో భాగంగా 2022-23లో కోటి మొక్కలను నా టాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకున్న ది. అందుకు అనుగుణంగా జిల్లా అటవీ శాఖతోపాటు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మొక్కలను నాటేందుకు ఇప్పటికే నర్సరీల్లో మొక్కలను కూడా సిద్ధం చేశారు. ఈ ఏడాది అవెన్యూ ప్లాంటేషన్ (రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటడం)తోపాటు పండ్లు, నీడనిచ్చే మొక్కలను నాటాలని నిర్ణయించారు. అయితే గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా హరితహారం కార్యక్రమంలో అన్ని శాఖలను భాగస్వాములను చేసేలా ఆయా శాఖల ఆధ్వర్యంలో నాటాల్సిన మొక్కల లక్ష్యాలను అట వీశాఖ అధికారులు సిద్ధం చేశారు. మొక్కలను నా టిన తర్వాత కూడా వాటి సంరక్షణకు చర్యలు తీసుకోనున్నారు.
మొక్కలను నాటేందుకు గుంత లు తీసే ప్రక్రియ నుంచి మొక్కలు నాటే వరకు ప్రతి మొక్కకూ జియోట్యాగింగ్ చేయనున్నారు. హరితహారం కార్యక్రమానికి నిధుల కొరత రావొద్దనే ఉద్దేశంతో రాష్ట్ర ప్ర భుత్వం హరితనిధి కార్యక్రమాన్ని ఏప్రిల్ నెల నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ప్రతినె లా హరితనిధి కింద డబ్బులు జమవుతున్నాయి. జిల్లాలో ఏడేండ్లుగా తెలంగాణకు హరితహారంలో భాగంగా 2015-16లో 73.78 లక్షల మొక్కలు, 2016-17లో 1.39 కోట్ల మొక్కలు, 2017-18లో 71.04 లక్షలు, 2018-19లో 86.12 లక్షల మొక్కలు, 2019-20లో 1.02 కోట్ల మొ క్కలు, 2021- 22 సంవత్సరంలో 89 లక్షల మొ క్కలను జిల్లాలో నాటారు. అయితే ఈ ఏడాది కోటి మొక్కలను నాటాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకోగా, ప్రధానంగా పండ్లు, పూల మొక్కలతోపాటు నీడనిచ్చే మొక్కలు, టేకు, జామ, నిమ్మ, సీతాఫల్, దానిమ్మ, మునగ, గులాబీ, మం దారం, మల్లె, శ్రీగంధం తదితర మొక్కలను నాటనున్నారు. జిల్లాలోని ప్రతి గ్రామంలో ఒక నర్సరీ ని ఏర్పాటు చేసిన దృష్ట్యా జిల్లావ్యాప్తంగా 560 నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేస్తున్నారు.
సరిపడా మొక్కలున్నాయి
జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో మొక్కలు లేకుండా ఉన్న ఖాళీ స్థలాలను గుర్తించడం జరిగిం ది. ఈ ప్రదేశాల్లో మొక్కలను నాటేందుకు ప్రణాళికను రూ పొందించాం. అటవీ ప్రాంతాల్లోని ఖాళీ స్థలాల్లో నాటేందుకు మొక్కలు సరిపడా ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా వర్షాలు ప్రారంభమైన దృష్ట్యా ఖాళీ ప్రాంతాల్లో దున్నిన అనంతరం గుంతలు తీసి మొక్కలను నాటుతాం.
– జానకీరామ్, జిల్లా అటవీశాఖ అధికారి