నందిగామ, జూన్ 16: ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల్లో అన్ని వసతులతో కూడిన నాణ్యమైన ఆంగ్ల మాధ్యమంలో బోధన అందుతున్నదని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, ఎమ్మెల్సీ వాణీదేవి, రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి అన్నారు. గురువారం వారు మండలంలోని చాకలిగుట్టతండా, మేకగూడ, చంద్రయాన్గూడ, అప్పారెడ్డిగూడ, వీర్లపల్లి, శ్రీనివాసులగూడ, బుగ్గోనిగూడ గ్రామాల్లో రూ. రెండు కోట్ల నాలుగు లక్షలతో మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మండలంలోని 44 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులతోపాటు సీఎంఆర్ఎఫ్ చెక్కులను కూడా అందజేశారు. నందిగామలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ ప్రహరీని ప్రారంభించి, నర్సరీని పరిశీలించారు.
అప్పారెడ్డిగూడలో రూ.10 లక్షలతో నిర్మిస్తున్న మహిళా సమాఖ్య భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడంతోపాటు వెంకమ్మగూడలో రూ. 5లక్షల జడ్పీ నిధులతో చేపట్టిన అండర్ డ్రైనేజీ పనులను ప్రారంభించారు. అదేవిధంగా చేగూరులో రూ. 5 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు, రూ.4 లక్షలతో నిర్మించిన అండర్ డ్రైనేజీ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకా లు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడా రు. ‘మన ఊరు-మన బడి’ ద్వారా కోట్లాది రూపాయలతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ బడుల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని, ఈ విద్యాసంవత్సరం నుంచే రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధన అమల్లోకి వచ్చిందన్నారు.
తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని వారు సూచించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, ఎంపీపీ ప్రియాంకగౌడ్, వైస్ ఎంపీపీ మంజులానాయక్, మాజీ ఎంపీపీ శివశంకర్‌గౌడ్, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు పద్మారెడ్డి, సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నారాయణరెడ్డి, చేగూర్ పీఏసీఎస్ చైర్మన్ అశోక్, మాజీ చైర్మన్ విఠల్, సర్పంచ్‌లు వెంకట్‌రెడ్డి, చంద్రారెడ్డి, రాజూనాయక్, నర్సింహ, రమేశ్‌గౌడ్, అశోక్, కుమార్, స్వామి, రాములమ్మ, లత, ఎంపీటీసీలు రాజూనాయక్, కుమార్‌గౌడ్, జడ్పీ సీఈవో దిలీప్, డీపీవో శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీవో బాల్‌రెడ్డి, తహసీల్దార్ వెంకటలక్ష్మి, ఎంఈవో కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.