కేశంపేట, జూన్ 16 : కేశంపేట మండలం కొత్తపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల కార్పొరేట్, ప్రైవేటుకు దీటుగా సకల వసతులతో ముస్తాబైంది. తెలంగాణ సర్కార్ బడుల్లో ఇంగ్లిష్ మీడియం విద్యాబోధనతో పాటు వసతుల కల్పిస్తూ పాఠశాలల దశ మార్చేందుకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు పాఠశాల భవనాలు, పరిసరాలు, గార్డెన్లను అందంగా తీర్చిదిద్ది విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రైవేటుకు ఏ మాత్రం తీసిపోకూడదనే సంకల్పంతో స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు వచ్చి ప్రభుత్వ పాఠశాల భవనాలతో పాటు వసతులను కల్పిస్తూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. అందులో భాగంగా కొత్తపేట పాఠశాలను బాగు చేసేందుకు హైదరాబాద్‌కు చెందిన నిర్మాణ్ సంస్థ ముందుకు వచ్చి పాఠశాలను రూ.40 లక్షలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. తరగతి గదుల్లో స్వాతంత్య్ర సమరయోధులు, పాఠ్యాంశాలలోని ముఖ్య అంశాలను పెయింటింగ్స్ వేయించారు. విద్యార్థులకు డిజిటల్ పాఠ్యాంశాలు బోధించేందుకు పాఠశాలలో ఏర్పాట్లు చేశారు. 400 మందికి పైగా విద్యార్థులు మధ్యాహ్న సమయంలో భోజనం చేసేందుకు డైనింగ్ హాల్‌ను నిర్మించారు. విద్యార్థుల సౌకర్యం కోసం టాయిలెట్లను నిర్మించారు. రూ.3లక్షలతో వాటర్ ఫిల్టర్‌ను ఏర్పాటు చేసి తాగునీటి వసతిని కల్పించారు.
సర్కార్ బడులపై ఆసక్తి..
ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధితో సర్కార్ బడుల్లో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రుల్లో ఆసక్తి పెరుగుతున్నది. లక్షల రూపాయలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం వరంగా మారింది. కొత్తపేటలో ప్రభుత్వ పాఠశాలలో నిర్మాణ్ సంస్థ చేసిన అభివృద్ధి, ఏర్పాట్లతో పాఠశాల కార్పొరేట్ పాఠశాలను తలపిస్తోంది. పాఠశాలను అభివృద్ధి చేసిన స్వచ్ఛంద సంస్థ సభ్యులకు కృతజ్ఞతలు.
– నవీన్‌కుమార్, సర్పంచ్, కొత్తపేట.
తల్లిదండ్రుల నుంచి స్పందన వస్తోంది
కొత్తపేట ప్రభుత్వ పాఠశాలలో నిర్మాణ్ సంస్థ వారు విద్యార్థుల సౌకర్యం కోసం తరగతి గదుల పునరుద్ధరణ, డిజిటల్ పాఠాల బోధన సౌకర్యం, పెయింటింగ్స్, డైనింగ్ హాల్, మినరల్ వాటర్ సౌకర్యం, టాయిలెట్లను నిర్మించారు. మధ్యాహ్న భోజనం వండేందుకు కిచెన్‌ను ఏర్పాటు చేశారు. పాఠశాలకు కలర్స్, పెయింటింగ్‌తో విద్యార్థుల్లో నూతనోత్సాన్ని నింపుతోంది. ఈ విద్యా సంవత్సరం విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.
– మనోహర్, ఇన్చార్జి ఎంఈవో, కొత్తపేట ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు