పరిగి, జూన్ 15 : గ్రామాల్లో పరిపాలన కేంద్రాలైన గ్రామపంచాయతీలకు కొత్తగా భవనాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఎక్కడెక్కడ గ్రామపంచాయతీలకు కార్యాలయాల నిర్మాణాలు చేపట్టాలి, అందుకు స్థలాలు అందుబాటులో ఎక్కడెక్కడ ఉన్నాయన్న వివరాలను సేకరిస్తున్నారు. వికారాబాద్ జిల్లా పరిధిలో మొత్తం 566 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఇందులో 239 గ్రామపంచాయతీలకు కార్యాలయాలు లేవని అధికారులు గుర్తించారు. ఇందులో 84 గిరిజన తండాలకు సంబంధించిన కొత్త గ్రామపంచాయతీలు ఉన్నాయి. జిల్లా పరిధిలో ఉన్న గ్రామపంచాయతీలలో చాలా వరకు భవనాలు ఉన్నప్పటికీ కొత్త గ్రామపంచాయతీలకు, గతంలో చాలా ఏండ్ల కింద నిర్మించిన భవనాలు శిథిలావస్థకు చేరిన దగ్గర కొత్త గ్రామపంచాయతీ కార్యాలయాలను నిర్మించనున్నారు.
కొత్త గ్రామపంచాయతీలకు రూ.వెయ్యి కోట్లు..
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన గిరిజన గ్రామాలకు సంబంధించిన పంచాయతీలకు కార్యాలయాలు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లను బడ్జెట్లో కేటాయించింది. కొత్తగా ఏర్పడిన గ్రామపంచాయతీలలో పంచాయతీ భవనాల కోసం సుమారు రూ.600 కోట్లు నిధులు ఉన్నాయి. ఇందులో పంచాయతీరాజ్ శాఖ నుంచి రూ.300కోట్లు, గిరిజన సంక్షేమం నుంచి రూ.300కోట్లు అందుబాటులో ఉన్నట్లు ఇటీవల పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రకటించారు. త్వరలోనే గ్రామపంచాయతీల భవనాల నిర్మాణాలను చేపట్టేందుకు వీలుగా అన్ని చర్యలు చేపడుతామని పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగా గ్రామపంచాయతీ భవనాల నిర్మాణాలకు సంబంధించిన కసరత్తు ప్రారంభమైంది. అలాగే గిరిజన తండాల్లో రోడ్లు, ఇతర సదుపాయాల కోసం రూ.140కోట్లు కేటాయించడంతో అన్ని తండాల్లో అంతర్గత రోడ్లు, ఇతర మౌలిక వసతులను కల్పించనున్నారు.
గ్రామపంచాయతీ భవనాలకు స్థలాలు..
వికారాబాద్ జిల్లా పరిధిలో 566 గ్రామపంచాయతీలు ఉండగా వాటిలో 239 గ్రామపంచాయతీలకు భవనాలు అవసరమని అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగా కొత్తగా ఏర్పడిన 84 గిరిజన పంచాయతీల్లో ముందుగా ప్రాధాన్యతా క్రమంలో భవనాలు నిర్మించనున్నారు. ప్రతి గ్రామపంచాయతీ నిర్మాణానికి గతంలో రూ.12లక్షలు ఖర్చు చేశారు. ప్రస్తుతం నూతనంగా నిర్మాణం చేపట్టే పంచాయతీ భవనాలకు నిధుల కేటాయింపుపై త్వరలోనే స్పష్టత రానున్నది. అంతలోపు భవనాల నిర్మాణానికి ఎక్కడెక్కడ స్థలాలు అందుబాటులో ఉన్నాయనే వివరాలు తెలియజేయాల్సిందిగా ఉన్నతాధికారులు ఆదేశించడంతో జిల్లా పరిధిలో పంచాయతీ భవనాలు లేనిచోట కొత్త భవనాల నిర్మాణానికి ఎక్కడెక్కడ స్థలాలు ఉన్నాయనేది అధికారులు పరిశీలిస్తున్నారు.
ఈనెల 18వ తేదీ వరకు పల్లె ప్రగతి కార్యక్రమం కొనసాగనుండగా, ఆ వెనువెంటనే స్థలాలు అందుబాటులో ఉన్న గ్రామపంచాయతీల జాబితాను ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే జిల్లా పరిధిలోని ఆయా మండలాల్లో ఎక్కడెక్కడ గ్రామపంచాయతీ భవనాలు అవసరం, వాటికి స్థలాలు ఉన్నాయా అని వివరాలను ఎంపీవోల ద్వారా ఆరా తీస్తున్నారు. ప్రభుత్వం బడ్జెట్లో గ్రామపంచాయతీల భవనాలకు నిధులు కేటాయించడంతోపాటు వికారాబాద్లో జెడ్పీ కార్యాలయ భవనం శంకుస్థాపనలో పాల్గొన్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు గ్రామపంచాయతీ భవనాల నిర్మాణాలకు నిధుల కేటాయింపుపై హామీ ఇచ్చారు. దీంతో త్వరలోనే నిధుల కేటాయింపునకు సన్నాహాలు జరుగుతున్నాయి.
గ్రామపంచాయతీ భవనాలకు స్థలాల సేకరణ..
జిల్లా పరిధిలో 566 గ్రామపంచాయతీలు ఉండగా, 239 గ్రామపంచాయతీ భవనాలు అవసరం ఉన్నాయి. భవనాల నిర్మాణాలకు అవసరమైన స్థలాలను సేకరించి నివేదికను ఉన్నతాధికారులకు పంపించడం జరుగుతుంది. నిధులు కేటాయించిన తర్వాత నిర్మాణాలు కొనసాగుతాయి.
– మల్లారెడ్డి, వికారాబాద్ జిల్లా పంచాయతీ అధికారి