మొయినాబాద్, జూన్ 12 : అంగవైకల్యం ఉన్నా ఆత్మైస్థెర్యం ఉంటే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంటుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితారెడ్డి అన్నారు. మండల పరిధిలోని హిమాయత్‌నగర్ గ్రామ రెవెన్యూలోని ఎస్ఎస్ఆర్ క్రికెట్ గ్రౌండ్లో మూడు రోజులుగా తెలంగాణ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఫర్ బ్లైండ్ ఫోరం ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఆదివారం ముగిసిన టోర్నమెంట్‌కు ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని విజేతలకు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నదన్నారు. క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు.
రెండు కండ్ల చూపు ఇవ్వకపోయినా భగవంతుడు మీకు మూడో కన్ను ఇచ్చారన్నారు. మీలో ఉన్న పట్టుదల కసిని చూస్తుంటే మీకు ఉన్న పట్టుదల, కసి.. అన్ని అవయవాలు ఉన్నవారికి భగంతుడు ప్రసాదిస్తే ఎన్నో విజయాలు సాధించడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. మిమ్మలను వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్నవారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నానని తెలిపారు. ఇదే స్ఫూర్తిని జీవితాంతం కొనసాగించాలని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ మంజుల, ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం, వైస్ ఎంపీపీ మమత, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు నరోత్తంరెడ్డి, ఉపసర్పంచ్ శ్యాంరావు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రవియాదవ్, నర్సింహారెడ్డి, శ్రీహరియాదవ్, రాఘవేందర్‌యాదవ్, దర్గ రాజు పాల్గొన్నారు.