వికారాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా మొత్తం 102 కేంద్రాల ద్వారా ధాన్యం సేకరిస్తుండగా.. ఇప్పటివరకు 10,354 రైతుల నుంచి రూ.99.82కోట్ల విలువ చేసే 50,950 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. యాసంగి సీజన్లో జిల్లాలో 45,600 ఎకరాల్లో వరి సాగవ్వగా 1.14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇందులో 70 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలనే లక్ష్యంతో అధికారులు ముందుకు సాగుతున్నారు. సేకరించిన ధాన్యానికి బిల్లులు అయిన వెంటనే డబ్బులను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు.
పరిగి, జూన్ 11 : రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం నష్టం వాటిల్లుతున్నా రైతాంగానికి మేలు చేకూర్చాలనే ఉద్దేశంతో ధాన్యం కొనుగోలు చేపడుతున్నది. గత యాసంగి సీజన్లో పండించిన వరి ధాన్యం కొనుగోలుకు కేంద్రం ముందుకు రాకపోయినా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలిచి కొనుగోలు చేస్తున్నది. వికారాబాద్ జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 50,950 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేపట్టింది. జిల్లాలోని 102 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. మరోవైపు ఎప్పటికప్పుడు సేకరించిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ కోసం రైస్ మిల్లులకు చేరవేస్తున్నారు. దీంతో ఎక్కడా ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను కొనసాగిస్తున్నారు. కొడంగల్ మండలంలోని రావులపల్లి, తాండూరు మండలంలోని కొత్లాపూర్ వద్ద రెండు చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి కర్ణాటక నుంచి రాష్ట్రంలోకి ధాన్యం తీసుకురాకుండా చర్యలు చేపట్టారు.
102 కొనుగోలు కేంద్రాల్లో 50,950 మెట్రిక్ టన్నులు
జిల్లావ్యాప్తంగా 102 కొనుగోలు కేంద్రాల ద్వారా 10354 మంది రైతుల వద్ద ప్రభుత్వం 50,950 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేపట్టింది. యాసంగి సీజన్లో 45,600 ఎకరాల్లో వరి సాగు చేపట్టగా 1,14,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరుగుతుందని అధికారులు అంచనా వేశారు. ఈసారి కొనుగోలు కేంద్రాల ద్వారా 70,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేపట్టాలని నిర్ణయించారు. ఈమేరకు జిల్లాలో మే నెల మొదటి వారంలో జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రారంభించారు. గ్రేడ్ ‘ఎ’ రకానికి రూ.1960, కామన్ రకానికి రూ.1940 చొప్పున మద్దతు ధర ప్రకటించారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో ఒక ఏఈవోను నియమించి టోకెన్ల పంపిణీకి చర్యలు చేపట్టడంతో సజావుగా ధాన్యం కొనుగోలుకు అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. అలాగే 5 క్లస్టర్లు ఏర్పాటు చేసి ఒక క్లస్టర్‌కు ఒక డిప్యూటీ తహసీల్దార్‌ను ఇన్చార్జిగా నియమించారు.
ఇందులో భాగంగా జిల్లాలో ఐకేపీ ఆధ్వర్యంలో 23 కొనుగోలు కేంద్రాల ద్వారా 2011 మంది రైతుల నుంచి 10,801.20 మెట్రిక్ టన్నులు, పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో 41 కేంద్రాల్లో 4463 మంది రైతుల నుంచి 21,360.40 మెట్రిక్ టన్నులు, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో 28 కేంద్రాల్లో 2402 మంది రైతుల నుంచి 13,550.25 మెట్రిక్ టన్నులు, మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో 7 కేంద్రాల్లో 1121 మంది రైతుల నుంచి 3,320.20 మెట్రిక్ టన్నులు, రైతు ఉత్పత్తి సంస్థల ఆధ్వర్యంలో 3 కేంద్రాల్లో 357 మంది రైతుల నుంచి 1918.32 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేపట్టారు. జిల్లావ్యాప్తంగా కొనుగోలు చేసిన 50,950 మెట్రిక్ టన్నుల వరి ధాన్యానికి రూ.99.82 కోట్లు విలువ అవుతుండగా ఇప్పటివరకు రూ.11 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయి. మరో రూ.40కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే ప్రక్రియ కొనసాగుతున్నది. మిగతా రూ.48కోట్లు త్వరలోనే విడుదల చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నారు.
వెనువెంటనే కస్టమ్ మిల్లింగ్‌కు..
జిల్లాలో 59 రైస్‌మిల్లులు ఉండగా వాటిలో 3 బాయిల్డ్ రైస్ మిల్లులు, 56 రా రైస్ మిల్లులున్నాయి. వాటికి 1,14,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లింగ్ చేసే సామర్థ్యం ఉన్నది. రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యం ఎప్పటికప్పుడు కస్టమ్ మిల్లింగ్ కోసం రైస్ మిల్లులకు తరలిస్తున్నారు. ఐకేపీ ఆధ్వర్యంలో 9640 మెట్రిక్ టన్నులు, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 19,250 మెట్రిక్ టన్నులు, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో 12,580 మెట్రిక్ టన్నులు, మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో 3,210 మెట్రిక్ టన్నులు, ఎఫ్‌పీవో ఆధ్వర్యంలో 1,825 మెట్రిక్ టన్నులు.. మొత్తం 46,505 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ కోసం తరలించారు. ప్రస్తుతం ఆయా కేంద్రాల్లో 4444 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉన్నది.
వారం పది రోజుల వరకు ధాన్యం కొనుగోలు
– విమల, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్
జిల్లా పరిధిలో మరో వారం పది రోజులపాటు ధాన్యం కొనుగోలు కొనసాగుతుంది. జిల్లాలో 102 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 10,354 మంది రైతుల వద్ద 50,950 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేపట్టాం. రూ.99.82 కోట్లకుగాను.. రూ.11 కోట్లు రైతులకు చెల్లించాం. మరో రూ.40 కోట్ల చెల్లింపుల ప్రక్రియ కొనసాగుతున్నది. సేకరించిన ధాన్యం ఎప్పటికప్పుడు కస్టమ్ మిల్లింగ్ కోసం రైస్ మిల్లులకు తరలిస్తున్నారు.