చేవెళ్లటౌన్, జూన్ 11 : నీటి వసతులు అరకొరగా ఉన్న రైతులకు బిందు సేద్యం (డ్రిప్) ఓ వరమే. వేసవిలో నీటి కొరతను అధిగమించడానికి డ్రిప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. డ్రిప్ పరికరాలకు రాష్ట్ర సర్కార్ సబ్సిడీ ఇస్తున్నది. డ్రిప్‌ను ఏ విధంగా జాగ్రత్త పర్చుకోవాలో చేవెళ్ల ఏడీఏ రమాదేవి సూచనలు, సలహాలు…
కొత్త డ్రిప్ ప్రారంభించే ముందు జాగ్రత్తలు..
కొత్త డ్రిప్ ప్రెషర్ కలుగజేసేందుకు అన్ని ప్రధాన వాల్స్లను, ల్యాటర్ పైప్ చివర మూసివేయాలి. పొలంలోని మొచిన్ వాల్స్‌ను తెరవాలి. మోటర్ ప్రారంభించిన వెంటనే ప్రెషర్ గేజ్‌ను గమనించాలి. ఎప్పుడు అదే ప్రెషర్లో నడపాలి. ఒకవేళ నీటి పంపు నుంచి కలిగే ప్రెషర్, డ్రిప్‌కు సిఫార్స్ చేసిన ప్రెషర్ కన్నా ఎక్కువగా ఉంటే బైపాస్ ద్వారా ఎక్కువగా నీటిని ఇతర అవసరాలకు వాడుకోవాలి. సిపార్సు చేసిన దానికన్నా డ్రిప్‌లో ప్రెషర్ తక్కువగా ఉన్నట్లయితే పైపులు కారడం గాని ఇతర వాల్వ్‌లు తెరచి ఉన్నయేమో గమనించాలి.
పాటించాల్సిన ఇతర విషయాలు..
ప్రెషర్‌ను గమనించాలి. ప్రతి రోజూ నీరు పారకం తర్వాత ఫిల్టర్లు, ఫర్టిగేషన్ పరికరాలను కడగాలి. ల్యాటరల్ పైపులు, వాల్వ్‌లను, ప్లష్ వాల్వ్‌లను ప్రతి పంట తర్వాత గానీ, నీటి రకాన్ని బట్టి 5-10 నీటి పారకాల గాని శుభ్రపరచాలి. ఆలాగే క్లోరిన్ ట్రీట్మెంట్ తర్వాత కూడా నీటిని శుభ్రపరచాలి. మూడు, నాలుగు నెలలకు ఒకసారి నీటి నమూనాలను సేకరించి నాణ్యతను పరీక్షిస్తూ తగినవిధంగా ఆమ్ల, క్లొరిన్, ట్రీట్మెంట్ ఇవ్వాలి.
ప్రెషర్‌ను పరీక్షించండిలా..
డ్రిప్ విధానం, కంట్రోల్ హెడ్ వద్ద ప్రెషర్‌ను తెలుసుకోవడానికి రెండు ప్రెషర్ గేజ్‌లను అమర్చాలి. మొదటి ప్రెషర్ గేజ్ ఫిల్టర్‌ను ఇన్లెట్ వద్ద, రెండో ప్రెషర్ గేజ్ కంట్రోల్ హెడ్ అవుట్ లెట్ వద్ద అమర్చి ప్రెషర్లోని తేడాలను గమనించాలి. ఒకవేళ మొదటి ప్రెషర్లో సిపార్సు చేసిన దానికంటే ఎక్కువైతే ఫిల్టర్‌ను కడగాలి.
ఫిల్టర్‌ను శుభ్రపర్చడం..
ఫిల్టర్‌ను క్రమబద్ధంగా ప్రతి రోజూ శుభ్రపరచాలి. ఇలా చేస్తే ఫిల్టర్ నీటి నుంచి మురికిని వేరు చేసి డ్రిప్పర్లు మూసుకోకుండా చేస్తాయి. ఫిల్టర్‌ను శుభ్రంగా కడగకపోతే మొక్కలకు తగినంత నీరు రాదు. ఇందులో నాలుగు రకాల ఫిల్టర్లు ఉంటాయి. పైడ్రో సైక్లిన్ ఫిల్టర్, స్క్రీన్ఫిల్టర్, స్టాండ్ ఫిల్టర్, డిస్క్ ఫిల్టర్ ఉంటాయి.
అధికారుల సూచనలు పాటించాలి..
రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలి. ప్రభుత్వ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. డ్రిప్ పరికరాలతో సాగు విస్తీర్ణం పెరుగుతుంది. పరికరాలను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. డ్రిప్‌తో రైతులు లాభాలు గడించొచ్చు.
– రమాదేవి చేవెళ్ల డివిజన్ ఏడీఏ