సిటీబ్యూరో, జూన్ 11(నమస్తే తెలంగాణ) : అధిక బరువును తగ్గించేందుకు 23 ఏండ్ల యువకుడు నగరంలోని ఓ జిమ్‌లో చేరాడు. అక్కడ పరిచయమైన ఓ న్యూట్రిషన్ డాక్టర్ తక్కువ రోజుల్లో బరువు తగ్గిస్తానని నమ్మించి.. 15 రోజులకు సరిపడా పిల్స్‌ను ఇచ్చాడు. వాటిని వాడిన ఆ యువకుడు చాలా ఉత్సాహంగా మారాడు. అయితే సరిగా నిద్రరాక, ఆకలివేయక, బరువు చాలా వరకు తగ్గాడు. బరువు తగ్గడంతో ఆ యువకుడు కొంత సంతోషానికి గురైనా.. మానసికంగా అలజడికి లోనయ్యాడు. కొన్ని సైడ్ ఎఫెక్ట్స్‌కు గురయ్యాడు. రోజూ నిద్ర కరువై.. ఇతర కార్యకలాపాలకు ప్రేరేపితుయ్యాడు. ఆ పిల్స్ లేనిదే అతడికి రోజు గడవడం కష్టంగా మారింది. సదరు న్యూట్రిషన్ వైద్యుడిని పిల్స్ కావాలని అడిగినప్పుడు.. చాలా ఖరీదు అంటూ.. భారీగా డబ్బులు గుంజాడు. ‘నీ లాగా ఇంకా ఎవరైనా బరువు తగ్గించుకోవాలని లేదా త్వరగా బాడీని స్ట్రాంగ్‌గా మలుచుకోవాలని ఆశపడేవారుంటే పరిచయం చేయాలని.. వారికి కూడా పిల్స్‌ను ఇస్తానని చెప్పాడు. అది కూడా భారీగా ఖర్చుపెట్టేవారు ఉండాలన్నాడు. దీంతో ఆ యువకుడు మరో ముగ్గురిని పరిచయం చేశాడు. సీన్ కట్ చేస్తే.. వీరంతా డ్రగ్స్‌కు అలవాటు పడి ఎన్డీపీఎస్ యాక్ట్‌లో నమోదై.. అమ్రిత ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ్ధ ఇచ్చే కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు.
పబ్‌లపై నిఘా పెరగడంతో..
పబ్‌లపై పోలీసుల నిఘా పెరగడంతో ఇప్పుడు డ్రగ్స్ సరఫరాదారులు జిమ్‌లపై దృష్టి సారించారని తెలిసింది. సంపన్నులు ఉండే ప్రాంతాల్లో ఉండే జిమ్‌లపై ప్రత్యేకంగా నజర్ పెట్టారు. అక్కడ న్యూట్రిషిన్ వైద్యులుగా చలామణి అవుతూ వారికి పిల్స్‌ను అందిస్తున్నట్లు తెలిసింది.
షార్ట్‌కట్‌లో బరువును తగ్గించుకోవడం, స్ట్రెస్ రిలీఫ్‌ను కోరుకునేవారు, బాడీ షేప్‌ను మార్చుకునేందుకు త్వరగా నీరసించి పోకుండా.. చాలా సేపు జిమ్ చేసే వారిని ఎంచుకుంటున్నారు. పరిచయం చేసుకుని డ్రగ్స్ పిల్స్‌ను అందించి వారికి అలవాటు చేస్తున్నారు. తాజాగా ఇలా న్యూట్రిషన్‌గా పరిచయమై మాదకద్రవ్యాలను అలవాటు చేస్తున్న వ్యక్తి పోలీసులకు చిక్కాడు. అతడి ఫోన్ కాంటాక్ట్స్‌పై ఆరా తీసినప్పుడు కొందరు యువకుల చిట్టా దొరికింది. వారు తమకు తెలియకుండానే డ్రగ్స్‌కు అలవాటుపడ్డారని విచారణలో తేలింది. ఆ యువకులను అరెస్టు చేసిన పోలీసులు.. వారికి డ్రగ్స్ అలవాటును మానిపించేందుకు జైలు నుంచి వచ్చిన తర్వాత అమృత ఫౌండేషన్ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ ఇప్పించారు.
బరువు తగ్గించుకునేందుకు వెళ్లి..
మా కౌన్సెలింగ్‌కు వచ్చిన యువకులు బరువు తగ్గించుకునేందుకు ప్రయత్నించి.. వారికి తెలియకుండానే డ్రగ్స్‌కు అలవాటుపడ్డారు. చివరకు ఎన్డీపీఎస్ యాక్ట్ లో బుక్ అయ్యారు. కాబట్టీ చాలా జాగ్రత్తగా ఉండాలి. మా స్వచ్ఛంద సంస్థకు వస్తున్న కేసులతో పాటు వివిధ సంస్థల సర్వేలను పరిశీలిస్తే కరోనా మహమ్మారి కాలంలో కొందరు యువకులు డార్క్‌నెట్ ద్వారా డ్రగ్స్‌ను కొని.. బానిసలయ్యారని తెలుస్తున్నది. ఈ అలవాట్లు కొత్త నేరాలకు పురిగొలుపుతున్నవి.
–డాక్టర్ దేవికారాణి, అమ్రిత ఫౌండేషన్