రంగారెడ్డి, జూన్ 11, (నమస్తే తెలంగాణ) : నేడు జరుగనున్న టెట్(ఉపాధ్యాయ అర్హత పరీక్ష)కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి పేపర్ ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, రెండో పేపర్ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగనుంది. జిల్లావ్యాప్తంగా 38,847 మంది అభ్యర్థులు టెట్ పరీక్షకు హాజరుకానున్నారు. మొదటి పేపర్‌కు 89 పరీక్షా కేంద్రాలకు 21,267 మంది అభ్యర్థులు, రెండో పేపర్‌కు సంబంధించి 75 పరీక్షా కేంద్రాలకు 17,583 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు నిర్ణీత సమయంలోగా చేరుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రానికి సంబంధించి ఏమైనా ఇబ్బందులుంటే శ్రీకాంత్-9396856548, సంతోష్-7799999142, అల్తాఫ్-9966653653లను సంప్రదించాలని సూచించారు.
ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరణ
వికారాబాద్ జిల్లావ్యాప్తంగా ఆదివారం జరిగే టెట్ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా పరిధిలో మొత్తం 9485 మంది అభ్యర్థులు టెట్ పరీక్షకు హాజరుకానున్నారు. పేపర్ 1 పరీక్ష కోసం 24 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా 5740 మంది అభ్యర్థులు హాజరవుతారు. పేపర్ 2 పరీక్ష కోసం 17 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా 3745 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. టెట్ పరీక్షల నిర్వహణకు జిల్లావ్యాప్తంగా పరీక్షా కేంద్రాల్లో 24 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 24 మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, 72 మంది హాల్ సూపరింటెండెంట్లు, 264 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. పరీక్షా కేంద్రాల్లోకి ఉదయం 8.30 గంటల నుంచే అభ్యర్థులను అనుమతిస్తారు. పరీక్షా సమయం ప్రారంభానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా జిల్లా పరిధిలోని పరిగి, వికారాబాద్, తాండూరు ఆర్టీసీ డిపోల నుంచి బస్సులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు 5 ఫ్లయింగ్ స్కాడ్ బృందాలను సైతం ఏర్పాటు చేశారు.