మొయినాబాద్, జూన్ 11 : అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా ఫామ్ హౌస్‌లు నిర్వహించినా, చట్టాన్ని ఉల్లంఘించినా.. మద్యం పార్టీలు పెట్టినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని శంషాబాద్ జోన్ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. ఆయన శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. శంషాబాద్ జోన్ పరిధిలో 367 ఫామ్ హౌస్‌లు ఉన్నాయని, అందులో మొయినాబాద్‌లోనే సుమారు130 వరకు ఫామ్ హౌస్‌లున్నాయని చెప్పారు. ఫామ్ హౌస్‌లు ఏర్పాటు చేసుకుని ఇష్టానుసారంగా చట్టాన్ని ఉల్లంఘించి పార్టీలు నిర్వహిస్తామంటే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. శ్రీరాంనగర్‌లో శుక్రవారం రాత్రి పార్టీ నిర్వహించిన ఫామ్ హౌస్‌కు అంతకుముందే (జూన్ 1న) నోటీసులు కూడా ఇచ్చినట్లు పేర్కొన్నారు. అయినా చట్టాన్ని ఉల్లంఘించారని పేర్కొన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పార్టీల్లో పాల్గొని పరువు పోగొట్టుకోవద్దన్నారు. మద్యం పార్టీలకు తప్పకుండా అబ్కారీ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలని తెలిపారు. సమావేశంలో ఏసీపీ గంగాధర్, ఇన్స్పెక్టర్ లక్ష్మీరెడ్డి ఉన్నారు.