కులకచర్ల, జూన్ 10 : ప్రభుత్వం రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి లబ్ధిదారులకు నేరుగా అందించేందుకు చర్యలు తీసుకుంటుంది. రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను అమలు చేస్తున్నది. రైతు బీమా, రైతు బంధు తదితర పథకాలు మంచి సత్ఫలితాలు ఇస్తున్నాయి. దీంతో పాటు రైతులకు మంచి చేసే ఉద్దేశంతో పీఏసీఎస్ కూడా రుణాలు అందించడంతో పాటు రుణాలు తీసుకున్న రైతులు మృతి చెందితే వారి అంత్యక్రియలకు రూ.9వేలు ఆర్థికసాయం అందించాలనే సరికొత్త పథకాన్ని తీసుకువచ్చి అమలు చేస్తున్నది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో అంత్యక్రియలకు ఆర్థికసాయం అందిస్తూ సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా రైతులు పీఏసీఎస్ ద్వారా రుణాలు తీసుకున్న వారు వివిధ కారణాలతో మృతి చెందితే వారికి కుటుంబాలకు కొద్దిమేరకు మృతి చెందిన వారికి అంత్యక్రియలకు సాయం అందిస్తూ రైతుల కుటుంబాలకు బాసటగా నిలుస్తోంది.
పీఏసీఎస్ సభ్యులకు తక్షణ సాయం
కులకచర్ల మండల కేంద్రంలోని పీఏసీఎస్ ద్వారా సభ్యత్వం కలిగి ఉన్న సభ్యులు మృతి చెందితే తక్షణ సాయంగా రూ.9వేలు ప్రాథమిక సహకార సంఘం ద్వారా అంత్యక్రియలకు ఖాతాదారుడి పేరు నుంచి రూ.3వేలు, ప్రాథమిక సహకార సంఘం నుంచి 3వేలు డీసీసీబీ నుంచి రూ.3వేలు కలిపి రైతు కుటుంబానికి రూ. 9వేలు ఆర్థిక సాయం అందిస్తున్నారు.
18మంది కుటుంబాలకు అందజేత..
వికారాబాద్ జిల్లా పరిధిలోని 25 ప్రాథమిక సహకార సంఘాలు ఉన్నాయి. కులకచర్ల మండల పరిధిలోని పీఏసీఎస్ ఖాతాదారులకు మూడు సంవత్సరాలుగా 18మంది బాధిత కుటుంబాలకు రూ.1.62లక్షలు ఆర్థిక సాయం అందజేశారు.
ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాం
రుణాలు పొందిన రైతులు మృతిచెందితే వారి కుటుంబానికి ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో రూ. 9వేలు ఆర్థికసాయం అందజేస్తున్నాం. రూ.లక్ష ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాం. ఖాతాదారులకు అన్నివిధాలుగా సేవలు అందించి రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
– బుయ్యని మనోహర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా
రైతులకు సహకారం..
పీఏసీఎస్ ద్వారా ఖాతాదారులు వివిధ కారణాల దృష్ట్యా మృతి చెందితే వారి అంత్యక్రియలకు రూ.9వేలు వారి కుటుంబసభ్యులకు అందజేస్తున్నాం. డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్‌రెడ్డి ఆదేశానుసారం ఈ సాయాన్ని అందిస్తున్నాం. కులకచర్ల మండలంలో జూన్ 10 వరకు 18మంది పీఏసీఎస్ ఖాతాదారులైన రైతులు మృతి చెందితే వారి కుటుంబాలకు రూ. 1,62,000 అందించాం.
– బక్కారెడ్డి, పీఏసీఎస్ సీఈవో కులకచర్ల