మొయినాబాద్, జూన్ 10 : అంగవైకల్యం ఉందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని..ఆత్మ విశ్వాసం ముందు అంగవైకల్యం తలవంచక తప్పదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల పరిధిలోని హిమాయత్‌నగర్ రెవెన్యూలోని ఎస్ఆర్ క్రికెట్ గ్రౌండ్లో సమన్వయ్ స్టేట్ లెవల్ బ్లైండ్ టోర్నమెంట్‌ను శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని అవయవాలు సక్రమంగా ఉన్న వారే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి నేను ఏమీ చేయలేనన్న నిరాశకు గురవుతున్నారని అన్నారు. కానీ అంధత్వం ఉండి కూడా క్రికెట్ ఆడటానికి సాహసం చేయడం చాలా గొప్ప విషయమన్నారు. అంగవైకల్యం శరీరానికే పరిమితమని క్రికెట్ అడుతున్న అంధ క్రికెటర్లు నిరూపించడం వారి ఆత్మవిశ్వాసానికి నిదర్శనమన్నారు. ముగింపు కార్యక్రమానికి మంత్రులను ఆహ్వానించి అంధ క్రికెటర్లలో మరింత ఆత్మ విశ్వాసాన్ని నింపుతామన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కాలె శ్రీకాంత్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు జయవంత్, మాజీ సర్పంచ్ శ్రీహరియాదవ్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు రవియాదవ్, దర్గ రాజు, డేవిడ్ పాల్గొన్నారు.
ఆడపడుచుల పెద్దన్న సీఎం కేసీఆర్
పేద ప్రజలకు సీఎం కేసీఆర్ పెద్దన్న అని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో 27 మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, 26 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి, చైర్పర్సన్ విజయలక్ష్మి, జడ్పీటీసీ గోవిందమ్మ, తహసీల్దార్ నయీమొద్దీన్, ఎంపీడీవో వెంకయ్య, వైస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, టీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు వాసుదేవ్ కన్నా పాల్గొన్నారు.