యాచారం, జూన్ 9 : గ్రామీణ ప్రాంతాల్లోని సర్కారు బడులకు మంచి రోజులొచ్చాయి. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. విద్యార్థులకు కనీస, మౌలిక వసతులను కల్పించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మన ఊరు-మన బడితో ఒకవైపు ప్రభుత్వం పాఠశాలలను అభివృద్ధి చేస్తుంటే మరోపక్క తనవంతు సాయంగా స్వచ్ఛంద సంస్థలు పాఠశాలల అభివృద్ధికి ముందుకొస్తున్నాయి. సీఎస్ఆర్ కార్పొరేట్ రెస్పాన్సిబుల్ స్కీం కింద పాఠశాలలకు స్వచ్ఛంద సంస్థలు చేయూతనివ్వడంతో తరగతి గదులు, పరిసర ప్రాంతాల రూపురేఖలు ఒక్కసారిగా మారుతున్నాయి.
గతంలో అధ్వానంగా ఉన్న పాఠశాలలు ప్రస్తుతం 2022-23 విద్యా సంవత్సరం నుంచి సకల సౌకర్యాలకు నిలయంగా మారుతున్నాయి. మన ఊరు-మన బడి కార్యక్రమంతో ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించడంతో పాటు ఆంగ్ల విద్యను ప్రవేశ పెడుతుండటంతో ప్రభుత్వ పాఠశాలలకు ఆదరణ పెరుగుతుంది. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న పాఠశాలలను ఎంపిక చేసుకొని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారు.
పూర్తి కానున్న మరమ్మతులు
మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి కన్సర్న్ ఇండియా ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. రూ.9లక్షల సొంత నిధులతో తరగతి గదుల మరమ్మతులతో పాటుగా పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు అన్నివిధాలుగా కృషి చేస్తున్నది. సంస్థ ప్రతినిధులు పాఠశాలలో తరగతి గదుల నిర్మాణ పనుల్లో భాగంగా తరగతి గదులకు తలుపులు, కిటికీలు, కిటికీలకు గ్రిల్స్‌ను ఏర్పాటు చేశారు. విద్యుత్ సౌకర్యాన్ని కల్పించి ఫ్యాన్లు బిగించారు. తరగతి గదులపై వర్షం నీరు కిందకు దిగకుండా ఫ్లోరింగ్ చేశారు. మూత్రశాలలు, మరుగుదొడ్ల మరమ్మతులతో పాటుగా విద్యుత్ సౌకర్యం, నీరు, డ్రైనేజీ, తలుపులు, కిటికీలను, నూతన కుండీలను ఏర్పాటు చేశారు. వంటగది పైకప్పును రేకుల షెడ్డుతో పాటు సెల్ఫ్ల నిర్మాణం చేశారు. పాఠశాలలో అరుగులు, మెట్లు, ర్యాంపులు నిర్మించారు. వాటర్ ట్యాంకును నిర్మించారు. డ్రేనేజీతో పాటుగా సెప్టిక్ ట్యాంకులకు మరమ్మతు చేశారు. వాటర్ ఫిల్టర్ సౌకర్యాన్ని సైతం కల్పించనున్నట్లు ప్రతినిధులు తెలిపారు.
పాఠశాలను బాగుచేయడం సంతోషకరం
కన్సర్న్ ఇండియా ఫౌండేషన్ సంస్థ ప్రతినిధులు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను గుర్తించి మౌలిక వసతులు కల్పించడం ఎంతో సంతోషకరం. ప్రస్తుతం అన్ని రకాల వసతులు ఉండటంతో పాఠశాలను మరింత బలోపేతం చేసి, మండలంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాం. కన్సర్న్ ఇండియా ఫౌండేషన్ సంస్థకు పాఠశాల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు.
– ముదిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, సర్పంచ్ యాచారం
స్వచ్ఛంద సంస్థలు ముందుకురావాలి
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకురావాలి. కన్సర్న్ ఇండియా ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ వారు మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం ఎంతో అభినందనీయం. పాఠశాలలో విద్యుత్, తాగునీరు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, తలుపులు, కిటికీలు తదితర మౌలిక వసతులు కల్పించడంతో విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది.
– సుకన్య, ఎంపీపీ యాచారం