యాచారం, జూన్ 9 : పల్లె ప్రగతితో సమస్యలు లేకుండా అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నది కుర్మిద్ద. గ్రామంలో ఆహ్లాదాన్ని పంచుతూ ఆకట్టుకునే హరితహారం మొక్కలు, మొక్కల పెంపకం కోసం ఏర్పాటు చేసిన వననర్సరీ, పచ్చదనాన్ని పెంపొందించడం కోసం పల్లె ప్రకృతివనం, అంతిమ వీడ్కోలు కోసం వైకుంఠధామం, తడి, పొడి చెత్తతో సేంద్రియ ఎరువును తయారు చేయడానికి డంపింగ్‌యార్డు, స్వచ్ఛమైన తాగునీటి కోసం మిషన్ భగీరథ ట్యాంకులు, నల్లాల ద్వారా ఇంటింటికీ తాగునీరు సరఫరా, 90శాతం సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కాలువల నిర్మాణం, ప్రధాన వీధుల్లో ఎల్ఈడీ బల్బులు, బహిరంగ మలవిసర్జన నిర్మూలనకోసం వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, తడి, పొడి చెత్త సేకరణ కోసం రూ. 9.5లక్షలతో పంచాయతీ ట్రాక్టర్, మొక్కలకు నీరందించేందుకు నీటి ట్యాంకర్, చెత్త సేకరణకు ట్రాలీలను సమకూర్చుకున్నారు. సకల సౌకర్యాలతో ఆ పంచాయతీ ప్రగతి బాటన పయనిస్తున్నది. అదే కుర్మిద్ద గ్రామ పంచాయతీ, కుర్మిద్ద గ్రామానికి కుర్మిద్దతండా, మర్లకుంటతండాలు అనుబంధంగా ఉన్నాయి. జూన్ 3నుంచి నిర్వహిస్తున్న పల్లె ప్రగతితో గ్రామంలో వందశాతం పనులను పూర్తి చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రణాళికలు చేస్తున్నారు.
ఆహ్లాదాన్ని పంచుతున్న పల్లె ప్రకృతివనం
ఆహ్లాదాన్ని పంచేలా గ్రామంలోని పల్లెప్రకృతి వనంలో మొత్తం 780 మొక్కలను పెంచుతున్నారు. పూల పార్కు(ఫ్లవర్ గార్డెన్)లో 250 పూల మొక్కలను పెంచుతున్నారు. పల్లె ప్రకృతి వనంలో వివిధ రకాల పండ్లు, పూలు, ఔషధ, డిజైన్ ఇతర మొక్కలు నాటారు. వాటిని సంరక్షించేందుకు కంచెలు ఏర్పాటు చేశారు. వాకింగ్ ట్రాక్‌లను నిర్మించారు. వాటర్ సరఫరాకు ప్రత్యేక పైప్‌లైన్ ద్వారా నీటిని అందిస్తున్నారు. చిట్టడవిని తలపించేలా మొక్కలను ముమ్మరంగా పెంచుతున్నారు.
మారిన ఊరి రూపురేఖలు
గ్రామపంచాయతీ గతంలో అనేక సమస్యలకు నిలయంగా ఉండేది. గ్రామీణ ప్రాంతాల రూపురేఖలను మార్చాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితో ప్రస్తుతం అభివృద్ధి, మౌలిక వసతుల్లో ముందంజలో నిలిచింది. ఇప్పటికే గ్రామంలో పాడుబడి శిథిలావస్థకు చేరిన 41 ఇండ్లను కూల్చివేశారు. రెండు పాడుబడిన పురాతన బావులను పూడ్చివేశారు. రోడ్లకు ఇరువైపులా ఉన్న కలుపు మొక్కలు, చెట్ల పొదలను తొలగించారు. గుంతలను మట్టితో నింపి చదును చేశారు. పంచాయతీ సిబ్బంది రోడ్లు, వీధులు, డ్రైనేజీలను శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్‌ను చల్లుతున్నారు. ఈగలు, దోమలు లేకుండా ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టారు.
ఆహ్లాదాన్ని పంచే పచ్చదనం
పచ్చదనాన్ని పెంపొందించేందుకు గ్రామంలో మొత్తం 7,000 మొక్కలను విరివిగా హరితహారం కార్యక్రమం ద్వారా నాటారు. రోడ్లకు ఇరువైపులా నాటి సంరక్షిస్తున్నారు. దీంతో పాటుగా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన వీధుల్లో మొక్కలు నాటారు. ట్రీగార్డులను ఏర్పాటు చేసి పెంచుతున్నారు. వాటికి తరచూ పాదులు తీసి, కలుపు మొక్కలను తొలగిస్తున్నారు.
నర్సరీలో మొక్కల పెంపకం
గ్రామంలో ప్రత్యేక నర్సరీ ఏర్పాటు చేసి తీరొక్క రంగుల పూలు, పండ్లు, ఔషధ, డిజైన్ మొక్కలను పెంచుతున్నారు. నర్సరీలో 18,000ల మొక్కలు పెంచి వచ్చే హరితహారం కింద నాటేందుకు సిద్ధం చేశారు. ఎండలో మొక్కలు ఎండి పోకుండా గ్రీన్నెట్లను ఏర్పాటు చేసి సంరక్షిస్తున్నారు.
అందుబాటులో వైకుంఠధామం
దహన సంస్కారాలు చేసేందుకు వైకుంఠధామాన్ని రూ. 13.5లక్షలతో నిర్మించారు. రెండు శ్మశాన వాటికలు, స్నానాల గదులు, మరుగుదొడ్లు ఉపయోగంలో ఉన్నాయి.
స్వచ్ఛమైన తాగునీరు సరఫరా
మిషన్ భగీరథ పథకం ద్వారా గ్రామంలో ఇంటింటికీ నల్లాల ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేస్తున్నారు. గ్రామంలో మొత్తం 6వాటర్ ట్యాంకులున్నాయి. కుర్మిద్దలో-4, కుర్మిద్దతండాలో-1, మర్లకుంటతండాలో-1 మిషన్ భగీరథ ఓహెచ్ఎస్ఆర్ వాటర్ ట్యాంకులున్నాయి. మొత్తం 720నల్లాల ద్వారా ఇంటింటికీ సక్రమంగా, సరిపడా నీటిని సరఫరా చేస్తున్నారు.
ఎరువుల తయారీ..
చెత్తరహిత గ్రామంగా తీర్చిదిద్దడానికి రూ.2.5లక్షలతో కంపోస్టుయార్డును నిర్మించారు. గ్రామంలో ఇప్పటికే తడి, పొడి చెత్త డబ్బాలను పంపిణీ చేశారు. ఇండ్లల్లో పేరుకుపోయిన చెత్తను గ్రామపంచాయతీ టాక్టర్ ద్వారా సేకరించి కంపోస్టు యార్డుకు తరలించి అక్కడ కంపోస్టు ఎరువును తయారు చేస్తున్నారు. సేంద్రియ ఎరువును తయారు చేసి హరితహారం కింద నాటిన మొక్కలు, నర్సరీ, పల్లెప్రకృతి వనంలో పెంచుతున్న మొక్కల ఎదుగుదలకు వేసేందుకు సిద్ధం చేస్తున్నారు. దీంతో రోడ్లపైన, జనవాసాల మధ్య చెత్తాచెదారం లేకుండా ఉండటంతో పాటుగా ప్లాస్టిక్ నిర్మూలన పూర్తిగా సాధ్యమైంది. చెత్త, ప్లాస్టిక్ వేసే డబ్బాలను గ్రామంలో అక్కడక్కడా ఏర్పాటు చేశారు.
ఊరుబయటకు మురుగునీరు
గ్రామంలోని మురుగునీరంతా ఊరికి దూరంగా డంపింగ్ చేస్తున్నారు. గ్రామంలో ఇండ్లనుంచి వచ్చే నీరంతా ఒక చోటికి చేర్చి భూమిలోకి పంపిస్తున్నారు. దీంతో భూగర్భ జలాలు పెరుగుతున్నాయి. పైగా అప్పుడప్పడూ ఈ నీటిని పంట పొలాలకు సైతం అందిస్తుంటారు.
పల్లె ప్రగతితో గ్రామానికి కొత్తరూపు
పల్లె ప్రగతి ద్వారా గ్రామ రూపురేఖలు మారిపోయాయి. వార్డు సభ్యులు, అధికారుల సమష్టి కృషితోనే పంచాయతీ అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగింది. కుర్మిద్ద గ్రామం అభివృద్ధి పథంలో పయనిస్తున్నది. పల్లె ప్రగతి పనులతో గ్రామంలో మునుపెన్నడూ లేని విధంగా అన్ని సౌకర్యాలను సమకూర్చాం. గ్రామంలో నెలకొన్న ఇతర సమస్యలు ఏమైనా ఉంటే నా దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరించేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తా.
– బందె రాజశేఖర్‌రెడ్డి, సర్పంచ్ కుర్మిద్ద
గ్రామాభివృద్ధే ధ్యేయం
గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యం. ఇప్పటికే పల్లె ప్రగతి ద్వారా అనేక సమస్యలను పరిష్కరించాం. 5వ విడుత పల్లె ప్రగతిలో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసి గ్రామాన్ని మరింతగా అభివృద్ధి చేసి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. చెత్త, ప్లాస్టిక్ కవర్లను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా గ్రామాన్ని శుభ్రంగా ఉంచాలి.
– అనిల్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి కుర్మిద్ద