రంగారెడ్డి, జూన్ 9, (నమస్తే తెలంగాణ) : సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ వానకాలం సీజన్లో పత్తి, కంది పంటల సాగును అధిక మొత్తంలో పెంచేలా జిల్లా వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. ఇందుకుగాను పత్తి, కంది పంటల సాగుపై జిల్లావ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహించేందుకు జిల్లా వ్యవసాయాధికారులు సమాయత్తమయ్యారు. పత్తికి మంచి డిమాండ్ ఉండడంతోపాటు మార్కెట్లో అధిక మొత్తంలో ధర ఉన్న దృష్ట్యా ఎట్టి పరిస్థితుల్లోనూ పత్తి సాగు పెంచేలా చర్యలు చేపట్టారు. పత్తి, కంది పంటల సాగుకు ఊరూరా రైతులకు అవగాహన కల్పించేందుకు నిర్ణయించారు.
ఒకట్రెండు రోజుల్లో జిల్లావ్యాప్తంగా సంబంధిత రెండు పంటలపై విస్తృతంగా గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించనున్నారు. ఇందులోభాగంగా ఊరూరా పోస్టర్లు, కరపత్రాలను రైతులకు పంపిణీ చేయనున్నారు. గురువారం కలెక్టర్ అమయ్‌కుమార్ సంబంధిత పంటల పోస్టర్, కరపత్రాలను ఆవిష్కరించారు. గత రెండు, మూడేండ్లుగా జిల్లాలో సాగైన పత్తి, కంది పంటలను పరిగణనలోకి తీసుకొని ఏయే గ్రామాల్లో పత్తి, కంది పంటలను సాగు చేయాలనే దానిపై వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా 4,88,597 ఎకరాల్లో ఆయా పంటలు సాగవుతాయని ప్రణాళికను తయారుచేయగా, వీటిలో పత్తి 2,75,050 ఎకరాలు, కంది 70,520 ఎకరాల్లో సాగయ్యేలా జిల్లా వ్యవసాయాధికారులు చర్యలు చేపట్టారు.
308 గ్రామాల్లో పత్తి సాగు
రెండు, మూడేండ్లుగా జిల్లాలో ఆయా గ్రామాల్లో సాగైన పంటల వివరాలను పరిగణనలోకి తీసుకొని జిల్లావ్యాప్తంగా 308 గ్రామపంచాయతీల్లో పత్తి సాగును పెంచేలా విస్తృతంగా ప్రచారం నిర్వహించేందుకు నిర్ణయించారు. జిల్లాలో ప్రధానంగా మాడ్గుల, ఆమనగల్లు, తలకొండపల్లి, కొందుర్గు మండలాల్లో పూర్తిస్థాయిలో పత్తి పంటను ప్రతి ఏటా సాగు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 19 మండలాల్లో పత్తి సాగు పెరిగేలా అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. పత్తి సాగుకు ఏ నేలలు అనుకూలం, ఎప్పటిలోగా పత్తి విత్తనాలను నాటాలి, ఎకరానికి ఎంతమేర విత్తనాలు అవసరం, ఎకరానికి ఎంతమేర ఎరువులు వాడాలి, పచ్చదోమ, తెల్లదోమ, తామరపురుగు, గులాబీరంగు, పచ్చ పురుగు, బూడిద తెగులు నివారణకు ఏ మందు వాడాలనే దానిపై రైతులకు అవగాహన కల్పించనున్నారు.
అదేవిధంగా పత్తి పంట సాగుతోనే అధిక మొత్తంలో లాభాలు అర్జించొచ్చనే విషయాన్ని రైతుల్లోకి విస్తృతంగా తీసుకుపోనున్నారు. రాష్ట్రంలో పండించే పత్తికి దేశీయంగా, విదేశాల్లో చాలా డిమాండ్ ఉండడం, ఎంత పత్తి పంటను సాగు చేసినా స్థానికంగానే ఆయా జిల్లాల్లోనే జిన్నింగ్ మిల్లుల ద్వారా సీసీఐ కొనుగోలు చేస్తుండడంతోపాటు ప్రభుత్వం మద్దతు ధర కూడా అందిస్తుండడంతో ప్రతి రైతూ పత్తినే సాగు చేసేలా అధికార యంత్రాంగం ముందుకెళ్తున్నది. జిల్లాలో సాగయ్యే పంటల్లో 60 శాతం మేర పత్తి సాగు పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించారు. గతేడాది జిల్లావ్యాప్తంగా 3.79 లక్షల ఎకరాల్లో ఆయా పంటలు సాగుకాగా, 1.31 లక్షల ఎకరాల్లో పత్తి సాగయ్యింది. ఈ వానకాలం సీజన్లో ఆయా పంటలు కలిపి మొత్తం 4.88 లక్షల ఎకరాల్లో సాగుకు నిర్ణయించగా, పత్తి 2.75 లక్షల ఎకరాల్లో సాగయ్యేలా రైతులను ప్రోత్సహించనున్నారు.
19 గ్రామపంచాయతీల్లో కంది సాగు
ఈ వానకాలం సీజన్లో జిల్లాలో పత్తి సాగుతోపాటు కంది పంట సాగును పెంచడంపై జిల్లా వ్యవసాయ శాఖ దృష్టి సారించింది. దీనిపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. జిల్లాలోని మొయినాబాద్, శంకర్పల్లి మండలాల్లోని 19 గ్రామపంచాయతీల్లో కంది పంట సాగును పెంచేలా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలో పప్పు ధాన్యాల ఉత్పత్తిని పెంచడమే కాకుండా ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన దృష్ట్యా జిల్లాలో ఈ వానకాలం సీజన్లో కంది పంట సాగును పెంచేందుకు నిర్ణయించారు. కంది పంట సాగుకు సంబంధించి ఆశ, మారుతి, హనుమ రకాల విత్తనాలతో సాగు చేయాలని అవగాహన కల్పిస్తున్నారు. గతేడాది వానాకాలం సీజన్లో 35 వేల ఎకరాల్లో కంది పంట సాగుకాగా, ఈ ఏడాది 75,020 ఎకరాల్లో సాగు చేసేందుకు రైతులను సిద్ధం చేస్తున్నారు.
రైతులు పత్తి, కంది పంటలనే సాగు చేయాలి
– కలెక్టర్ అమయ్‌కుమార్
రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు జిల్లా రైతాంగం పత్తి, కంది పంటలను సాగు చేయాలి. సంబంధిత రెండు పంటలతో అధిక లాభాలు ఆర్జించే అవకాశం ఉన్న దృష్ట్యా ఊరూరా విస్తృతంగా రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయాధికారులను ఆదేశించాం. జిల్లాలోని రైతు వేదికల్లో పత్తి, కంది పంటల సాగుపై అవగాహన కల్పించి ఈ పంటల సాగు గణనీయంగా పెరిగేలా చూడాలని సూచించాం.
పత్తి పంట సాగులో చేయాల్సిన పనులు