వికారాబాద్ జిల్లా భూములు కూరగాయలు, పండ్ల సాగుకు అనుకూలమని వ్యవసాయశాఖ అధికారులు తేల్చారు. పలు ప్రాంతాల్లో పర్యటించిన నిపుణుల బృందం మట్టి నమూనాలను పరీక్షించి జిల్లావ్యాప్తంగా సారవంతమైన నేలలు ఉన్నాయని, ఉద్యాన పంటల సాగుతో అధిక దిగుబడులు సాధించవచ్చని పేర్కొన్నారు. దీంతో రాబోయే రెండు మూడేండ్లలో జిల్లాలో కాయగూరలు, పండ్లు, పప్పుదినుసుల వంటి పంటల సాగు విస్తీర్ణాన్ని భారీగా పెంచే దిశగా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వచ్చే ఏడాదిలోగా 75వేల ఎకరాలకు పెంచాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. జిల్లా చెంతనే హైదరాబాద్ ఉండడంతో సలువుగా మార్కెటింగ్ చేసుకోవచ్చు. నగరానికి అవసరమైన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు జిల్లా రైతులు నేరుగా తీసుకెళ్లి విక్రయించవచ్చు. అంతేకాకుండా రైతులకు మరింత మేలు చేసేందుకు ఇక్కడి ఉత్పత్తులను కరీంనగర్, నిజామాబాద్ వంటి నగరాలకు సైతం సరఫరా చేసేలా అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు. ఆయా మండలాల్లోని మహిళా రైతు ఉత్పత్తి సంస్థల ద్వారా మహిళా రైతులను కూరగాయలు, ఉద్యాన పంటల సాగు వైపు ప్రోత్సహించనున్నారు. ఉద్యాన పంటల సాగుకు రాయితీ, బిందు సేద్యానికి సబ్సిడీ అందించనున్నారు. మరోవైపు జిల్లాలో 31వేల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
-పరిగి, జూన్ 9
పరిగి, జూన్ 9 : వికారాబాద్ జిల్లాలోని భూములు ఉద్యాన పంటలకు అనుకూలమని అధికారులు తేల్చారు. జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి ఉద్యాన సలహాదారు, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ శ్రీనివాస్‌రావు జిల్లాలోని భూముల్లో అత్యధికం ఉద్యాన పంటలకు అనుకూలమని, జిల్లావ్యాప్తంగా 75వేల ఎకరాలకు పెంచుకునేందుకు అవకాశం ఉందని సూచించారు. దీంతో రాబోయే సంవత్సరాల్లో జిల్లా పరిధిలో కూరగాయలతోపాటు ఇతర ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెంపు లక్ష్యంగా ఉద్యాన శాఖ ప్రణాళికలు రూపొందించనుంది. ఇందులో భాగంగా కూరగాయలు, ఇతర ఉద్యాన పంటల సాగుకు ఉద్యాన శాఖ అధికారులకు ముఖ్యమంత్రి ఉద్యాన సలహాదారు సూచనలు చేయడంతో అందుకనుగుణంగా ప్రణాళికలు రూపొందించనున్నారు.
పలు ప్రాంతాల్లో కూరగాయలు, ఇతర ఉద్యాన పంటలు
వికారాబాద్ జిల్లా పర్యటనలో పలు మండలాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి ఉద్యాన సలహాదారు శ్రీనివాస్‌రావు జిల్లాలోని వికారాబాద్, నవాబుపేట, మోమిన్‌పేట్, పూడూరు తదితర మండలాల్లో కూరగాయలు, ఉద్యాన పంటల సాగు పెంచుకునేందుకు అవకాశం ఉందని అధికారులకు సూచించారు. బొప్పాయి, అరటిపండ్ల తోటల పెంపకానికి కోట్‌పల్లి, మర్పల్లి, వికారాబాద్ మండలాలు అనుకూలమని పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం సుమారు 28వేల ఎకరాల్లో కూరగాయలు, 32వేల ఉద్యాన పంటలు సాగులో ఉన్నాయి.
ఈ సాగు విస్తీర్ణంలో రాబోయే సంవత్సరాల్లో 75వేల ఎకరాలకు పెంచుకోవడం ద్వారా రైతులు ఆర్థికంగా అభివృద్ధి సాధించవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. కూరగాయలు, ఆకుకూరలతోపాటు బొప్పాయి, అరటి, వాటర్మెలాన్, మస్టర్మెలాన్, దానిమ్మ తోటల పెంపు లాభదాయకంగా ఉంటుంది. ఆలుగడ్డ సాగు వెయ్యి ఎకరాల్లో జరుగుతుండగా దీన్ని 5వేల ఎకరాలకు పెంచేందుకు సూచించారు. క్యాప్సికమ్, టమాట, దొండకాయ సాగు సైతం పెంచుకునేందుకు అవకాశం ఉందని సూచించారు. వీటితోపాటు ఆయిల్‌పామ్‌ను జిల్లావ్యాప్తంగా 31వేల ఎకరాల్లో సాగు చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో కూరగాయలు, ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెంచేందుకు అవసరమైన అన్ని చర్యలను అధికారులు చేపట్టనున్నారు.
మార్కెటింగ్ సదుపాయం
జిల్లా పరిధిలోని మండలాల్లో సాగు చేసే కూరగాయలు, ఆకుకూరలు, ఇతర ఉద్యాన పంటల ఉత్పత్తులను విక్రయించేందుకు హైదరాబాద్ నగరం పెద్ద మార్కెట్‌గా పేర్కొంటున్నారు. హైదరాబాద్ నగరానికి అవసరమైన కూరగాయలు, ఆకుకూరలు ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా పరిధిలోని మండలాల రైతులు వరికి బదులుగా కూరగాయలు, ఉద్యాన పంటల సాగు పెంచడం ద్వారా రైతాంగానికి ఆదాయం పెంపొందించేందుకు ప్రణాళికలు రూపొందించనున్నారు. దీంతో పెద్దఎత్తున కూరగాయలు, పండ్లను హైదరాబాద్‌లో నేరుగా రైతులు విక్రయించే సదుపాయం కల్పించడంతోపాటు కరీంనగర్, నిజామాబాద్ వంటి నగరాలకు సైతం సరఫరా చేసేలా ఏర్పాట్లు చేయనున్నారు.
ఇందులో ప్రధానంగా జిల్లావ్యాప్తంగా మహిళా రైతులను ప్రోత్సహించాలని నిర్ణయించారు. ఆయా మండలాల్లోని మహిళా రైతు ఉత్పత్తి సంస్థల ద్వారా మహిళా రైతులను కూరగాయలు, ఉద్యాన పంటల సాగు వైపు మళ్లించేందుకు అవసరమైన శిక్షణా తరగతులు సైతం ఏర్పాటు చేయనున్నారు. వివిధ రకాల కూరగాయలు సాగు చేసేందుకు క్రాప్ కాలనీల విధానం సైతం అమలుకు ఉద్యాన శాఖ అధికారులు సన్నాహాలు చేపట్టారు. మిషన్ ఫర్ ఇండికేటెడ్ డెవలప్మెంట్ హార్టికల్చర్(ఎంఐడీహెచ్), రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద ఉద్యాన పంటల సాగుకు రాయితీ అందించడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర మైక్రో ఇరిగేషన్ పథకం ద్వారా బిందు సేద్యానికి చిన్న సన్నకారు రైతులకు 90 శాతం, మిగతావారికి 80 శాతం, ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం సబ్సిడీపై పరికరాలు అందించి ప్రోత్సహించనున్నారు.
ఉద్యాన పంటల సాగుకు జిల్లా భూములు అనుకూలం
– టి.శ్రీనివాస్‌రావు, ముఖ్యమంత్రి ఉద్యాన సలహాదారు
వికారాబాద్ జిల్లా ఉద్యాన పంటల సాగుకు అనుకూలంగా ఉంది. ఎర్ర చెలక నేలలు, వాతావరణం అనువుగా ఉండడంతొ వివిధ రకాల కూరగాయల పంటలు, అరటి, బొప్పాయి, దానిమ్మ, కర్బూజ, తర్బూజ వంటివి మంచి నాణ్యతగా ఉత్పత్తి అవుతాయి. జిల్లా రైతులు వరికి ప్రత్యామ్నాయంగా ఉద్యాన పంటలు సాగు చేసి లాభాలు గడించాలి. వికారాబాద్ జిల్లా పరిధిలో సాగు చేసే కూరగాయలు, ఉద్యాన పంటలను విక్రయించేందుకు హైదరాబాద్‌లో మార్కెటింగ్ సదుపాయం ఉండడం కలిసివచ్చే అంశం.