ఇబ్రహీంపట్నం, జూన్ 9 : తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కారు బడుల్లో చేర్పించాలని కోరుతూ..ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బడిబాట కార్యక్రమం ముమ్మరంగా సాగుతున్నది. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాలతో పాటు ఇబ్రహీంపట్నం, తుర్కయాంజాల్, పెద్దఅంబర్‌పేట్, ఆదిబట్ల మున్సిపాలిటీల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమంలో పాల్గొని విస్తృత ప్రచారం నిర్వహించారు.
నందిగామ :ఐసీడీఎస్ సూపర్వైజర్ జ్యోతి ఆధ్వర్యంలో నర్సప్పగూడ గ్రామంలో మన ఊరు మన అంగన్వాడీ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించి ఇంటింటికీ తిరుగుతూ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు, అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ అశోక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ యాదయ్య, పంచాయతీ కార్యదర్శి జానకీరామ్, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, నాయకులు యాదగిరిగౌడ్, భూపాల్ తదితరులు పాల్గొన్నారు.
మంచాల : ఆరుట్ల గ్రామంలో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణలో రూ. 13 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులను సర్పంచ్ విష్ణువర్ధన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే బోధన ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు చీరాల రమేశ్, కావలి శ్రీనివాస్, ఉపసర్పంచ్ జంగయ్య గౌడ్, గ్రామస్తులు పాల్గొన్నారు.