బొంరాస్‌పేట, జూన్ 9 : బొంరాస్‌పేటలో ప్రతి సంవత్సరం ఆషాఢమాసానికి ముందు రెండు రోజులపాటు నిర్వహించే దుర్గామాత ఉత్సవాల్లో భాగంగా గురువా రం మహిళలు మహిళలు బోనాలతో గ్రామంలోని వీధుల గుండా ఊరేగింపుగా ఆలయానికి వెళ్లి ప్రదక్షిణలు చేశారు. నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఊరేగింపులో పోతరాజు విన్యాసాలు, మహిళలు సవారి నిండిన దృ శ్యాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. కొందరు మేకపోతులు బలిచ్చి అమ్మవారి మొక్కు చెల్లించుకున్నారు. ప్రజలు దుర్గామాతను దర్శించుకుని పూజలు చేశారు. వర్షాలు సమృద్ధిగా కురువాలని, పంటలు బాగా పండాలని దుర్గామాతను ప్రార్థించారు.
ఘనంగా దుర్గామాత ఊరేగింపు
ఉత్సవాలలో భాగంగా గురువారం రాత్రి దుర్గామాత ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. అమ్మవారి విగ్రహానికి పూజలు చేసిన తరువాత బ్యాండు మేళాల మధ్య గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం దేవాలయంలో ప్రతిష్టించారు. ఊరేగింపులో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. శుక్రవారం సాయంత్రం రంగం కార్యక్రమం నిర్వహిస్తారు. ఏర్పులమ్మ గద్దె ఎక్కి భవిష్యవాణి వినిపిస్తారు.