వికారాబాద్, జూన్ 9 : తల్లిదండ్రులులేని అనాథ బాలికలు హైదరాబాద్‌లోని దుర్గాబాయిదేశ్‌ముఖ్ ప్రభుత్వ మహిళా టెక్నికల్ శిక్షణా సంస్థలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారి లలితకుమారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2022-23 విద్యాసంవత్సరానికి 3 సంవత్సరాల డిప్లొమా కోర్సుకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్, కంప్యూటర్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ తదితర కోర్సులు ఉంటాయన్నారు.
మొత్తం 240 సీట్లలో 70 శాతం తల్లిదండ్రులు కోల్పోయిన(అనాథ) బాలికలు, నిరుపేద బాలికలు, అక్రమ రవాణా బాధితులకు కేటాయించబడుతుందని పేర్కొన్నారు. వీరు పాలిటెక్నిక్ అర్హత ప్రవేశ పరీక్ష రాయకున్నా కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత పొంది ఉండాలని, 3 శాతం సీట్లు దివ్యాంగులకు కేటాయించినట్లు తెలిపారు. కులం (అనాథ బాలికలకు అవసరం లేదు), ఆదాయ ధ్రువీకరణ పత్రం (అనాథలకు అవసరం లేదు), మరణ ధ్రువీకరణ పత్రం, బోనఫైడ్, కార్యాలయంలో లభించే దరఖాస్తు ఫారానికి జతచేయాలన్నారు. వీటిని వికారాబాద్‌లోని ఎన్నెపల్లి బాల రక్షాభవన్ కార్యాలయంలో జూన్ 20లోగా అందజేయాలని సూచించారు. ఇతర వివరాలకు 6300725515, 9160314854లను సంప్రదించాలన్నారు. ఎంపికైన బాలికలకు ఉచిత విద్య, వసతి సౌకర్యం కల్పిస్తారని పేర్కొన్నారు.