కొత్తూరు, జూన్ 8: కొత్తూరు నూతన మున్సిపల్ కార్యాలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏడాది కింద కొత్తూరు మున్సిపాలిటీ ఏర్పడగా, పాత గ్రామపంచాయతీ కార్యాలయంలోనే పాలనాపరమైన సేవలు కొనసాగిస్తున్నారు. భవనం ఇరుకుగా ఉండడంతో అటు అధికారులు, ఇటు ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. భవనం ఎదుట ఖాళీ స్థలం లేకపోవడంతో పార్కింగ్‌కూ తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక ఎవరైనా వీఐపీలు కొత్తూరు మున్సిపాలిటీకి వస్తే ఆ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. మున్సిపల్ పాలక వర్గం ఏమైనా సమావేశాలు పెట్టుకోవాలన్నా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కొత్త మున్సిపల్ కార్యాలయం ఏర్పాటుతో అటు ప్రజలు, ఇటు మున్సిపల్ అధికారుల కష్టాలు తీరనున్నాయి.
రూ.3.5 కోట్లతో నూతన భవన నిర్మాణం..
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రూ.3.5 కోట్లతో నూతనంగా మున్సిల్ కార్యాలయం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అందులో భాగంగా అన్ని హంగులతో రాష్ట్ర ప్రభుత్వం కొత్తూరు పురపాలక కార్యాలయ భవనాన్ని రెండెకరాల స్థలంలో నిర్మిస్తున్నది. జీ ప్లస్ వన్ అంతస్తులో నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో సిటిజన్ సర్వీస్ సెంటర్, రెవెన్యూ, శానిటేషన్ , ఇంజినీరింగ్, అకౌంట్స్, టౌన్ ప్లానింగ్, వాటర్ సప్లయ్ తదితర పనులు జరుగుతున్నాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లోనే కమిషనర్ చాంబర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇక మొదటి అంతస్తులో చైర్ పర్సన్ చాంబర్, సమావేశ మందిరాలను నిర్మిస్తున్నారు. దీంతో పాటు రెండెరాల స్థలంలో భవనం నిర్మాణం పోగా, మిగతా స్థలంలో పచ్చదనానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. వచ్చిపోయే వాహనాల కోసం పార్కింగ్‌కు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
అన్ని హంగులతో మున్సిపల్ భవన నిర్మాణం
అన్ని సౌకర్యాలతో కొత్తూరు మున్సిపాలిటీకి నూతన కార్యాలయాన్ని నిర్మిస్తున్నాం. మున్సిపల్ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ హామీ ఇచ్చారు. రూ.3.5 కోట్లు మంజూరు కావడంతో అన్ని హంగుతో భవనాన్ని నిర్మిస్తున్నాం. అన్ని సెక్టన్లను గ్రౌండ్ ప్లోరోలోనే నిర్మిస్తున్నాం. భవన నిర్మాణంతో పాటు గ్రీనరీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. ఈ ఏడాదిలోనే నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తెస్తాం.
-లావణ, మున్సిపల్ చైర్ పర్సన్, కొత్తూరు