మహేశ్వరం, జూన్ 8: మన పల్లెలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని, స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు లబ్ధి పొంది కుటుంబాలను బాగు చేసుకుంటున్నారని, మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పంచాయతీరాజ్, విద్యాశాఖ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబితారెడ్డి అన్నారు. బుధవారం మహేశ్వరం మండలం గొల్లూరు, అమీర్‌పేట, మన్సాన్పల్లి గ్రామాల్లో పల్లెప్రగతిలో భాగంగా క్రీడాప్రాంగణాలు, రోడ్లను చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితాహరినాథ్‌రెడ్డితో కలిసి మంత్రులు ప్రారంభించారు. అనంతరం మన్సాన్పల్లిలో మహిళా సంఘాలకు రూ.54 కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రులు మాట్లాడారు.
సీఎం కేసీఆర్ ఆదేశాలతో జిల్లాలో చిరు వ్యాపారాలను చేసుకోవడానికి రుణాలిచ్చామని, ఇప్పుడు సత్ఫలితాలు వస్తున్నాయన్నారు. మహిళా సంఘాలు తయారు చేసే వస్తువులకు డిమాండ్ పెంచాలని మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు. రూ.400 గ్యాస్ సిలిండర్ ధరను రూ.1055 చేసిన ఘనత మోదీ ప్రభుత్వానికే దక్కుతుందని ఎద్దేవా చేశారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం వల్ల నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయన్నారు. బోరు మోటర్లకు మీటర్లు పెట్టాలని మోదీ సర్కారు అంటే.. తెలంగాణలో అమలు చేయబోమని సీఎం కేసీఆర్ రైతుల పక్షాన ఉన్నారని గుర్తుచేశారు. రైతు బంధు కోసం రూ.10వేలు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు.
రాష్ట్రంలో ఐకేపీ, స్త్రీశక్తి కింద రూ.15 వేల కోట్ల రుణాలు ఇచ్చామని, ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే రూ.520 కోట్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. సీజన్లవారీగా వ్యాపారాలు చేస్తే ప్రభుత్వ సహకారం ఉంటుందని.. మామిడిపండ్లు, సీతాఫలాలను కొనుగోలు చేసి ఆమ్మాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ అమయ్‌కుమార్, అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్, ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్‌ఎంపీపీ సునీత, సహకార బ్యాంక్ చైర్మన్ పాండుయాదవ్, ఇబ్రహీంపట్నం ఆర్డీవో వెంకటాచారి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజునాయక్, ప్రధాన కార్యదర్శి రాఘవేందర్‌రెడ్డి, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు రాఘవేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వరలక్ష్మి, సర్పంచ్‌లు, అధికారులు, కోఆప్షన్ సభ్యులు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.