పరిగి, జూన్ 8 : చిరు వ్యాపారులకు బ్యాంకర్లు విరివిగా రుణాలు అందించి వారిని ప్రోత్సహించాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల కోరారు. బుధవారం వికారాబాద్‌లోని సత్యభారతి ఫంక్షన్‌హాలులో ఆజాదీకే అమృత్ మహోత్సవ్‌లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం ఆదేశాల మేరకు నిర్వహించిన ప్రజా చేరువ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బ్యాంకింగ్ ఔట్ రిచ్ కార్యక్రమంలో బ్యాంకర్లు పాల్గొని స్వయం సహాయక బృందాలకు పెద్దఎత్తున రుణాలు అందజేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రతి వినియోగదారుడికి బ్యాంకింగ్ సేవలను అందించాలని సూచించారు. బ్యాంకర్లు, ప్రభుత్వ శాఖల అధికారులు పరస్పర సహకారంతో అధిక మొత్తంలో రుణాలు అందజేయాలని సూచించారు.
అంతకుముందు ఆర్థిక అక్షరాస్యత, రుణ వితరణ, సామాజిక భద్రత పథకాలపై వినియోగదారులకు బ్యాంకర్లు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వివిధ జాతీయ బ్యాంకుల ద్వారా రూ.28.30కోట్లు రుణాలను జిల్లా మహిళా సమాఖ్య సంఘాలకు అందజేశారు. అర్బన్ మహిళా సంఘాలకు రూ.1.39కోట్ల రుణాల చెక్కులను కలెక్టర్ పంపిణీ చేశారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో 500 మంది వీధి వ్యాపారులకు రూ.1.15 కోట్ల రుణాలు అందజేశారు. బ్యాంక్ ఆఫ్ బరోడా తాండూరు శాఖ ద్వారా ఒక లబ్ధిదారుడికి రూ.2.65కోట్ల హౌసింగ్ లోన్ అందించారు. కార్యక్రమంలో డీఆర్డీవో కృష్ణన్, మున్సిపల్ కమిషనర్ శరత్చంద్ర, హెచ్‌డీసీసీబీ డీజీఎం సత్యప్రసాద్, నాబార్డ్ డీడీఎం ప్రవీణ్‌కుమార్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చీఫ్ మేనేజర్ వెంకటస్వామి, యూబీఐ చీఫ్ మేనేజర్ శ్రీనివాస్, ఎస్బీఐ చీఫ్ మేనేజర్ అనుప్రభ, ఎస్బీఐ రీజినల్ మేనేజర్ శ్రీరామకృష్ణ, ఎస్ఎల్బీసీ ఎస్డీఐ ఏజీఎం సత్యహరిప్రసాద్, ఎస్బీఐ ఆర్ఏసీసీ చీఫ్ మేనేజర్ ప్రశాంత్ ఆనంద్, సీఏసీ మేనేజర్ రామాంజనేయులు, బ్యాంకర్లు పాల్గొన్నారు.