రంగారెడ్డి, జూన్ 6, (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లా పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. హైదరాబాద్‌కు కూతవేటు దూరంలోనే ఇండస్ట్రియల్ పార్కులుండడంతోపాటు పరిశ్రమల నిర్వహణకు కావాల్సిన సకల వసతులను కల్పిస్తుండడంతో జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నారు. ఎన్నో ఇండస్ట్రియల్ పార్కులు, హార్డ్‌వేర్ పార్కులు, ఐటీ టవర్స్, మెగా ఉత్పత్తి పరిశ్రమలు జిల్లాలో నెలకొల్పారు. దేశంలోని అమెజాన్, వెల్స్పన్, క్రోనస్, టాటా, విజయ్‌నేహా, పోకర్ణ ఇంజినీర్ స్టోన్, నాట్కో ఫార్మా, రెనెసిస్, కాస్పర్, విప్రో, ఎంఎస్ఎన్లాంటి ప్రముఖ పరిశ్రమల ప్లాంట్లు జిల్లాకు తరలివచ్చాయి. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన టీఎస్-ఐపాస్ ద్వారా పారిశ్రామికరంగంలో చాలా మార్పు వచ్చింది. గతంలో ఓ భారీ పరిశ్రమను ఏర్పాటు చేయాలంటే ఆరు నెలల వరకు సమయం పట్టేది, అంతేకాకుండా అనుమతి వస్తుందా, రాదనేది కూడా గ్యారంటీ ఉండేది కాదు. కానీ టీఎస్-ఐపాస్ విధానంతో ఎంత భారీ పరిశ్రమ ఏర్పాటుకైనా కేవలం పదిహేను రోజుల్లోగా అనుమతులు లభిస్తుండడంతో అధిక మొత్తంలో పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. పరిశ్రమలకు నాణ్యమైన 24 గంటల నిరంతర విద్యుత్తు సరఫరా చేస్తుండడంతో కూడా పరిశ్రమలను నెలకొల్పేందుకు పారిశ్రామికవేత్తలు ఉత్సాహం చూపుతున్నారు.
2020-21లో రూ.2వేల కోట్ల పెట్టుబడులు
టీఎస్ఐ-పాస్ ద్వారా రంగారెడ్డి జిల్లాకు అధిక మొత్తంలో పెట్టుబడులు వచ్చాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికి అందిస్తున్న ప్రాధాన్యతతో 2020-21 ఆర్థిక సంవత్సరంలో పెద్దఎత్తున పెట్టుబడులు వచ్చాయి. సోమవారం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ 2020-21 సంవత్సరానికి సంబంధించిన ఇండస్ట్రియల్ వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటైన ప్రముఖ పరిశ్రమలకు సంబంధించి ప్రస్తావించారు. 2021లో పరిశ్రమల ఏర్పాటు ద్వారా రూ.2వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. వీటిలో ఎలక్రికల్ వెహికల్ తయారీ పరిశ్రమతో రూ.500 కోట్లు, మలబార్ పరిశ్రమతో రూ.600 కోట్లు, కిటెక్స్ పరిశ్రమ ద్వారా రూ.1200 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. కిటెక్స్ ద్వారా రాష్ర్టానికి రూ.2400 కోట్ల పెట్టుబడులురాగా, సంబంధిత కిటెక్స్ టెక్స్టైల్స్ పరిశ్రమను జిల్లాలోని చందన్వెల్లి ఇండస్ట్రియల్ పార్కుతోపాటు వరంగల్‌లో ఏర్పాటు చేసేందుకు అనుమతులు జారీ అయ్యాయి. మలబార్ పరిశ్రమను మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడ ఈ-సిటీలో నెలకొల్పనుండగా, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమను కూడా చందన్వెల్లి ఇండస్ట్రియల్ పార్కులోని సీతారాంపూర్‌లో 200 ఎకరాలను ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది. సంబంధిత పరిశ్రమలన్నీ ఏడాదిలోగా ఉత్పత్తులు ప్రారంభించనున్నాయి.
ఇప్పటివరకు రూ.71,674 కోట్ల పెట్టుబడులు
టీఎస్-ఐపాస్ ద్వారా ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా ఏర్పాటైన పరిశ్రమలతో రూ.71,674 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 2016 నుంచి ఇప్పటివరకు టీఎస్-ఐపాస్ ద్వారా 1408 పరిశ్రమలకు అనుమతులు మంజూరయ్యాయి. వీటిలో 516 సూక్ష్మతరహా పరిశ్రమలతో రూ.376 కోట్లు, 586 చిన్నతరహా పరిశ్రమలతో రూ.2284 కోట్లు, 72 మధ్యతరహా పరిశ్రమలతో రూ.1056 కోట్లు, 109 భారీ తరహా పరిశ్రమలతో రూ.6288 కోట్లు, 23 మెగా ఉత్పత్తి పరిశ్రమలతో రూ.6941 కోట్లు, 102 మెగా ఇన్ఫ్రా పరిశ్రమలతో రూ.54,725 కోట్ల పెట్టుబడులు జిల్లాకు వచ్చాయి. ఇప్పటివరకు 9,54,300 మంది యువతకు పరిశ్రమల ఏర్పాటుతో ఉపాధి లభించింది. సూక్ష్మతరహా పరిశ్రమలతో 9547 మందికి, చిన్నతరహా పరిశ్రమలతో 20,239, మధ్యతరహా పరిశ్రమలతో 6979, భారీ తరహా పరిశ్రమలతో 24,636, మెగా ఉత్పత్తి పరిశ్రమల ఏర్పాటుతో 9324, మెగా ఇన్ఫ్రా పరిశ్రమలతో అత్యధికంగా 8,83,575 మందికి ఉపాధి లభించింది.