ఇబ్రహీంపట్నం, నవంబర్ 30 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో విస్తారంగా వర్షాలు కురిసి ఈ ప్రాంతమంతా సస్యశ్యామలంగా మారిన నేపథ్యంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఇబ్రహీంపట్నం పెద్దచెరువులో వరుణార్చన హోమాన్ని నిర్వహిస్తున్నారు. గతంలో ఈ చెరువులో వర్షాల కోసం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి వరుణ యాగం చేశారు. వరుణ యాగం నిర్వహించిన స్థలంలోనే వరుణార్చన హోమాన్ని ఎమ్మెల్యే నిర్వహించతలపెట్టారు. ఈ హోమంలో రాజకీయాలకతీతంగా సుమారు పదివేలమందికి పైగా పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే చెరువు ఒడ్డున హోమగుండంతో పాటు పెద్దఎత్తున చలువపందిర్లు వేశారు. హోమానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తాగునీరు, కూర్చునే వసతి వంటి సౌకర్యాలను కల్పించారు. హోమం నిర్వహించే ప్రదేశం, చలువ పందిర్ల కింద శానిటైజేషన్ చేశారు. అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు.
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్న హోమానికి నియోజకవర్గం నుంచి పదివేలమంది హాజరయ్యేలా అన్ని ఏర్పాట్లు చేశారు. రాజకీయాలకతీతంగా హాజరుకావాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి స్వయంగా ఆయా పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులకు, వ్యాపారులకు స్వయంగా ఫోన్లు చేసి ఆహ్వానించారు. హోమంతోపాటు శివలింగాలకు పూజలు చేయనున్నారు.
ముఖ్య అతిథులుగా మంత్రులు హరీశ్‌రావు, సబితారెడ్డి, ఎమ్మెల్సీ కవిత
వరుణార్చన హోమానికి మంత్రులు హరీశ్‌రావు, సబితారెడ్డి, ఎమ్మెల్సీ కవిత, జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. హోమం ఉదయం 6:30గంటలకు ప్రారంభమవుతుంది. శ్రీశైలం దేవస్థానానికి సంబంధించిన 30మంది ఋత్వికులతో ముందుగా వరుణుడికి అభిషేకం, అర్చన, అనంతరం హోమం నిర్వహించనున్నారు. హోమంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి, ఆయన సతీమణి ముకుందమ్మతోపాటు మరికొంతమంది కూర్చోనున్నారు.
రాజకీయాలకతీతంగా హాజరు కావాలి : ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
వరుణార్చన హోమానికి రాజకీయాలకతీతంగా పాల్గొనాలని ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ముఖ్యంగా కుటుంబసమేతంగా హాజరుకావల్సిందిగా ఆయన కోరారు. చెరువులు, కుంటలు ఎండిపోయి ఉపాధి కోసం అన్నదాతలు వలస పోయిన నేపథ్యంలో ఇబ్రహీంపట్నం చెరువులో వరుణయాగాన్ని నిర్వహించినట్లు చెప్పారు. ప్రస్తుతం పరిస్థితి కుదుటపడటంతో వరుణార్చన హోమాన్ని చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.