అబ్దుల్లాపూర్‌మెట్, జూన్ 5 : రాజీవ్ స్వగృహలో హెచ్ఎండీఏ అనుమతితో ఏర్పాటు చేసిన ప్లాట్ల వేలంపాటలో ఆసక్తిగలవారు పాల్గొని ప్లాట్లను దక్కించుకోవాలని టీఎస్ఐఐసీ చీఫ్ ఇంజినీర్ శ్యాంసుందర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శివకుమార్ అన్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కవాడిపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నం.35లో 10 ఎకరాల్లో చేపట్టిన రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలం పాటపై అవగాహన కల్పించేందుకు ఆదివారం సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నగర శివారులోని ఔటర్ రింగ్‌రోడ్డు సమీపంలో గల కవాడిపల్లిలో మౌలిక సౌకర్యాలతో అతి తక్కువ ధరలకే ప్రభు త్వం ప్లాట్లను అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు.
ఆన్లైన్ ద్వారా ప్లాట్లు బుక్ చేసుకోవాలని సూచించారు. వేలం పాటలో పాల్గొనేవారు ఈ నెల 14 వరకు రిజిస్ట్రేషన్ చేసుకొని సబ్మిషన్ చేసుకోవాలన్నారు. లేఅవుట్లలోని 1 నుంచి 40 ప్లాట్ల వరకు 15న మధ్యా హ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, 41వ ప్లాట్ నుంచి 80వ ప్లాట్ వరకు 16న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 81వ ప్లాట్ నుంచి 117వ ప్లాట్ల వరకు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో వేలం పాట ఉంటుందని తెలిపారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా లేఅవుట్లోని పార్కు స్థలంలో మొక్కలను నాటారు. కార్యక్రమంలో జోనల్ మేనేజర్ రవి, డిప్యూటీ జోనల్ మేనేజర్ పవార్, అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ వెంకటేశ్వర్లు, సిబ్బంది ఉన్నారు.