పెద్దఅంబర్‌పేట, జూన్ 5 : బర్త్‌డే పార్టీ అనగానే.. ఓ కేకు, నాలుగు క్యాండిళ్లు లేదంటే కేకుపై చిన్నపాటి క్యాండిల్ క్రాకర్.. పది బెలూన్లు సాధారణంగా కనిపిస్తుంటాయి. బర్త్‌డేకు వెళ్తున్నాం అంటే.. ఎవరి బాబుది అని ఠక్కున అడిగేస్తుంటారు? సాధారణంగా చిన్న పిల్లలకే ఎక్కువగా పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తుంటారు. పుట్టిన మొదటి మూడేండ్లు వేడుకను చాలామంది ఘనంగా నిర్వహిస్తుంటారు. ఇంకొందరు దాదాపు 10 నుంచి 12 ఏండ్ల వరకు బర్త్‌డే పార్టీ జరుపుకొంటారు.. కానీ, యూత్ సైతం బర్త్‌డే పార్టీలను ఘనంగా జరుపుకొంటుండటం ఇప్పుడు మరింత ట్రెండ్‌గా మారింది.. అదీ సాదాసీదా కాదు.. జోష్‌గా జరుపుకొంటున్నారు. ఒకప్పుడు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులకే పరిమితమైన ఈ సంస్కృతి ఇప్పుడు పల్లెలకూ తాకింది. నగర శివారుతోపాటు రంగారెడ్డి జిల్లాలో ఈ తరహా సంబురాలు పెరిగిపోతున్నాయి.
పూల దండలు.. సన్మానాలు
ఇంటి ముందే పెద్ద ఫ్లెక్సీ, భారీ కటౌట్ దర్శనమిస్తుంది.. ‘హ్యాపీ బర్త్‌డే బాయ్’ అంటూ స్వాగతం పలుకుతుంటుంది. చీకటి పడగానే దాని చుట్టూ లైట్లు ఏర్పాటవుతాయి. చిన్నగా డీజే సౌండ్లు మొదలవుతాయి. స్టేజీ సిద్ధమవుతుంది.. ఇక కేకు రెడీ. బర్త్‌డే బాయ్ స్టేజీపైకి రాగానే డీజే సౌండ్ దద్దరిల్లిపోతుంది. ఇక ఆటలు షురూ. బర్త్‌డే బాయ్ పేరులోని అక్షరానికి ఒకటి చొప్పున (ఉదాహరణకు ఇంగ్లిష్‌లో పేరు నిఖిల్ అనుకుంటే ఆరు అక్షరాలు) కేకులు టేబుల్‌పై సిద్ధమవుతాయి. చేతుల్లోకి పెద్ద పెద్ద పటాకులు వచ్చి చేరుతాయి. అందరూ కేరింతలు పెడుతుండగా.. ఆకాశంలో (120 షాట్స్) పేలుడు, మెరుపులు మెరుస్తుండగా కేకులు కట్ చేయిస్తున్నారు. ఒక్కొక్కరూ వచ్చి పూల దండలు వేయడం, శాలువాలు కప్పడం అనేది ట్రెండ్‌గా మారుతున్నది. ఇంకొందరు స్నేహితులు స్వయంగా కేకులు తీసుకొచ్చి కోయిస్తున్నారు. ఆపై పిల్లలందరికీ పంచి పెడుతున్నారు. అర్ధరాత్రి వరకు సంబురాలు జరుపుకొంటున్నారు. ఇక బర్త్‌డే బాయ్‌లు.. హండీలు ఆర్డర్ చేస్తూ వచ్చినోళ్లందరికీ బిర్యానీలు తినిపిస్తున్నారు.