మొయినాబాద్, జూన్ 5 : హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనులకు అడుగులు పడుతున్నాయి. రోడ్డు పనులు చేపట్టడానికి నేషనల్ హైవే అథారిటీ వారు భూమి గట్టితనం కోసం మట్టి పరీక్షలు చేయిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు విస్తరణ కోసం భూములను సేకరించి నేషనల్ హైవే అథారిటీ వారికి అప్పగించడంతో కాంట్రాక్టర్లతో రోడ్డు పనులు చేప్టటడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్-బీజాపూర్ రహదారికి కేంద్ర ప్రభుత్వం 2015లో జాతీయ రహదారిగా ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు రోడ్డు విస్తరణ పనుల కోసం రూ.896 కోట్లు మంజూరు చేసింది.
అప్పా జంక్షన్ నుంచి వికారాబాద్ జిల్లా మన్నెగూడ వరకు పనులు కొనసాగనున్నాయి. మొయినాబాద్, చేవెళ్లలో బైపాస్ మట్టి పరీక్షలు చేస్తున్నారు. రెండేండ్లలో అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయడానికి మేఘ కన్స్ట్రక్షన్ వారు టెండర్ తీసుకున్నారు. 5 మీటర్ల నుంచి 15 మీటర్ల లోతు వరకు మట్టి పరీక్షలు చేస్తున్నారు. రోడ్డు విస్తరణ పనులు పూర్తైతే సాఫీగా ప్రయాణం చేయొచ్చని ప్రయాణికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.