పరిగి, జూన్ 4: కొడంగల్ నియోజకవర్గాన్ని వందల కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. శనివారం కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ కొడంగల్‌పై సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక అభిమానం ఉందన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో బస్సు డిపోను ఏర్పాటు చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. కొడంగల్‌లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. అంతేకాకుండా త్వరలోనే 100 పడకల దవాఖాన అందుబాటులోకి రానుందన్నారు. డిగ్రీ కాలేజీ, ముదిరాజ్ భవనాల నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. అదనంగా డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేయడంతోపాటు మరిన్ని రోడ్ల నిర్మాణానికి అవసరమైన నిధులు అందిస్తామని హామీనిచ్చారు. నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు స్థానిక ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. కులపిచ్చి రేవంత్‌రెడ్డికి కొడంగల్ ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. ఇక్కడ తంతే పోయి మల్కాజిగిరిలో పడ్డాడని, అక్కడి ప్రజలు సైతం తన్నేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. తెలంగాణకు ఎప్పటికైనా సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అన్నారు.
కొడంగల్ నియోజకవర్గంలో వందల కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నా యని, మరింత అభివృద్ధ్దికి నిధులను మంజూరు చేస్తామని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ తెలిపారు. శనివారం సాయంత్రం కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల అనంతరం జరిగిన సభలో ఆయన మా ట్లాడారు. రాష్ట్రంలో కొడంగల్ నియోజకవర్గంలోనే బస్సు డిపోను ఏర్పాటు చేయడం జరిగిందని, దీనిని బట్టి సీఎం కేసీఆర్‌కు కొడంగల్‌పై ఉన్న ప్రత్యేక అభిమానానికి ఇది నిదర్శనమన్నారు. బస్సుడిపో ఏర్పాటులో ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి కృషి ఎంతో ఉందన్నారు. నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు జరిగాయని, చదువాలంటే పెద్ద జాబితే అవుతుందన్నారు.
కొడంగల్‌లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్
కొడంగల్‌లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను నెలకొల్పి యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. యువత ఆగం కారాదని, టీఆర్ఎస్ హయాంలోనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతున్నదన్నారు. త్వరలోనే కొడంగల్‌లో 100 పడకల దవాఖాన అందుబాటులోకి రానున్నదన్నారు. అదేవిధంగా తన నియోజకవర్గమైన సిరిసిల్లలోనూ లేని బంజారాభవన్ నిర్మాణం కొడంగల్‌లో జరుగుతున్నదని మంత్రి తెలిపారు. ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి కోరిక మేరకు నియోజకవర్గానికి డిగ్రీ కళాశాల, కొడంగల్‌లో ముదిరాజ్భవన్ నిర్మాణానికి నిధులు, మరిన్ని రోడ్ల నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేయిస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. అదేవిధంగా నిరుపేదల కోసం మూడు వేల రెండు పడకల ఇండ్ల నిర్మాణానికి ఒక్కొక్కరికీ రూ.3 లక్షల చొప్పున అందిస్తామని, అదనంగా మరిన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కూ డా మంజూరు చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో కొడంగల్‌లో విశేషంగా అభివృద్ధి జరుగుతున్నదన్నారు. 2014 కంటే ముందు కొడంగల్ ఎలా ఉంది.. ప్రస్తుతం ఎలా ఉందో నియోజకవర్గ ప్రజలకు తెలుసని పేర్కొన్నారు.
కాంగ్రెస్ హయాంలో రోజుకు ఆరు గంటలు కూడా కరెంటు ఇవ్వలేదని విమర్శించారు. ఎరువులు, విత్తనాల కోసం రైతులు ప్రతి ఏడాది తీవ్ర ఇబ్బందులకు గురయ్యే వారిని గుర్తు చేశా రు. గతంతో పోల్చితే ప్రస్తుతం పరిస్థితులు ఎం తో మారినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రభు త్వం రాష్ట్రంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నదని కొనియాడారు. రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ, వృద్ధాప్య, వితంతు పింఛన్లు వంటి పలు అభివృద్ధి, సంక్షే మ పథకాలను నిరాటంకంగా కొనసాగిస్తున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. రైతుకు కష్టం రాకుండా కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నదన్నారు. కాంగ్రెస్ హయాంలో రూ.200 పింఛ న్ ఇస్తే వృద్ధుల మందులకు కూడా సరిపోయేవి కావని, కానీ నేడు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం రూ.2016 పింఛన్ అందిస్తుందని తెలిపారు. త్వరలోనే కొత్త పింఛన్లు వస్తాయని, వాటిని ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి ఇంటింటికీ తిరిగి అందిస్తారని మంత్రి కేటీఆర్ తెలిపారు.
రంగారెడ్డి- పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇవ్వాలి
రంగారెడ్డి-పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి బీడు భూములను తవ్వి బంగారం పండిద్దామని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల తెలంగాణకు వచ్చారని, మళ్లీ వస్తున్నట్లు తెలిసిందని, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వరని ఆయన కొడంగల్ ప్రజల తరఫున ప్రశ్నించారు. కర్ణాటకలోని అప్పర్ తుం గభద్రకు జాతీయ హోదా ఇచ్చి.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు ఎందుకు ఇవ్వరన్నారు. రెండు జాతీయ పార్టీలకు నీతి, జాతి లేదని, ఆ పార్టీలను బండకేసి కొట్టాలన్నారు. తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని అన్నారు. ఏ నాయకుడి నాయకత్వం లో రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకుపోతున్నదో అదే నాయకుడిని ఆశీర్వదించి ముందుకు పోదామన్నారు. కార్యక్రమంలో యువజన, క్రీడలశా ఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధ్దన్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాల్‌రాజ్, కొడంగల్, పరిగి, మక్తల్, నారాయణపేట, దేవరకద్ర ఎమ్మెల్యేలు పట్నం నరేందర్‌రెడ్డి, కొప్పు ల మహేశ్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఎస్. రాజేందర్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, నారాయణపేట కలెక్టర్ హరిచందన, ఎంపీపీలు ముద్దప్ప దేశ్‌ముఖ్, జగన్నాథ్‌రెడ్డి, విజయకుమార్, మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్‌రెడ్డి, శిరీష, వీరారెడ్డి పాల్గొన్నారు.
మరోసారి అవకాశం ఇవ్వమని అడగడం సిగ్గుచేటు
50 ఏండ్లు అవకాశమిస్తే రాష్ర్టానికి, దేశానికి ఏమి చేయలేని దద్దమ్మలు కాంగ్రెస్ పార్టీ నాయకులని.. వారు మరోసారి అవకాశం ఇవ్వాలని అడగడం సిగ్గుచేటని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో ఏమీ కాదని, బూతులు తిట్టడం, బ్లాక్ మెయిల్ మాత్రమే చేస్తారని ఆరోపించారు. కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి ఉన్నన్నీ రోజు లు ఏమాత్రం అభివృద్ధి జరుగలేదని, అతడు చాలా డేంజర్ మనిషి అని, ఎక్కడ కాలు పెడితే ఆ పార్టీ నాశనమవుతుందన్నారు. ప్రసుత్తం కాంగ్రెస్‌లో ఉంటూ ఆ పార్టీని నాశనం చేస్తున్నారని పే ర్కొన్నారు.
ఓ పార్టీ అధ్యక్షుడికి కుల పిచ్చి, మరో పార్టీ అధ్యక్షుడికి మత పిచ్చి ఉందని, అలాంటి పార్టీ నాయకులను తరిమికొట్టాలని మంత్రి కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. మా కులానికే పదవులు ఇవ్వండని రేవంత్‌రెడ్డి అంటాడని, నరేందర్‌రెడ్డి అందరి వాడని.. 24 గంటలపాటు ప్రజల కు అందుబాటులో ఉంటూ అద్భుతమైన సేవలు చేస్తున్నారని ఆయన కొనియాడారు. రేవంత్‌రెడ్డి లాంటి ఐరన్ లెగ్ కావాలా..?, నరేందర్‌రెడ్డి లాం టి గోల్డెన్ లెగ్ కావాలా..? కొడంగల్ ప్రజలు తేల్చుకోవాలని సూచించారు. మీరు తంతే మల్కాజిగిరిలో పడ్డ రేవంత్‌రెడ్డిని అక్కడ కూడా తన్నాలని ఆ నియోజకవర్గ ప్రజలు చూస్తున్నారని తెలిపారు. మత పిచ్చి, కుల పిచ్చి నాయకులకు సమాధానం చెప్పే శక్తి తెలంగాణ యువతకే ఉన్నదని, వారందరినీ మన పొలిమేర దాకా తరిమి కొట్టాలన్నారు. కులపిచ్చి, మతపిచ్చి పార్టీలతో ఎలాంటి అభివృద్ధి జరుగదన్నారు.