పరిగి, జూన్ 4 : మన బస్తీ-మన బడి కార్యక్రమంతో సర్కారు బడుల రూపురేఖలు మారనున్నాయని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. శనివారం పరిగి పట్టణంలోని ప్రాథమిక పాఠశాలలో మన బస్తీ-మన బడి కార్యక్రమంలో భాగంగా చేపట్టే పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మూడు విడుతల్లో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 12 అంశాలకు సంబంధించిన సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. డిజిటల్ తరగతుల నిర్వహణకు సైతం ఏర్పాట్లు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్న పాఠశాలల్లో డైనింగ్ హాల్స్, ప్రతి పాఠశాలకు ప్రహరీ నిర్మాణం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధనతో విద్యార్థులకు మరింత ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.
బడిబాట కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి పలువురు విద్యార్థులను పాఠశాలలో చేర్పించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఎ.సురేందర్, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆర్.ఆంజనేయులు, టీఆర్ఎస్ నాయకులు బి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎంఈవో హరిశ్చందర్, టీఆర్ఎస్ నాయకుడు బి.రవికుమార్, కౌన్సిలర్ అర్చన పాల్గొన్నారు.
యువత కష్టపడి చదువాలి
నవాబుపేట, జూన్ 4 : యువత కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శనివారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా మండల కేంద్రంలోని గ్రంథాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం అలవర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి లలిత కుమారి, జిల్లా విద్యాధికారి రేణుకాదేవి, ఎంపీపీ భవానీ, జడ్పీటీసీ జయమ్మ ఎంపీడీవో సుమిత్రమ్మ, తహసీల్దార్ రవీందర్, మండల విద్యాధికారి గోపాల్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు ఎల్. పాండు, ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు, రాములు, సర్పంచ్ విజయలక్ష్మిప్రకాశ్, సీహెచ్‌వో శివకుమార్ పాల్గొన్నారు.
ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ బడులు
బొంరాస్పే, జూన్ 4 : బడీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఎంపీడీవో పాండు తల్లిదండ్రులకు సూచించారు. శనివారం మండలంలోని మదన్‌పల్లి, మదన్పల్లితండాల్లో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడానికి ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది నుంచి ఇంగ్లిష్ మీడియం అమలు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు ఉచిత భోజనం, పాఠ్య పుస్తకాలు, బట్టలు అందిస్తారని ఎంపీడీవో అన్నారు. ఈ సందర్భంగా సీఆర్పీ సోమ్లానాయక్, హెచ్ఎంలు కావేరి, శ్రీనివాస్ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి బడిబాట ప్రాముఖ్యాన్ని వివరించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం
కొడంగల్, జూన్ 4: ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రారంభమవుతున్నట్లు ఐనాన్పల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేణుగోపాల్ పేర్కొన్నారు. గ్రామంలో బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలల్లోని సౌకర్యాలు, ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు మౌనిక పాల్గొన్నారు.
చౌడాపూర్ మండల కేంద్రంలో..
కులకచర్ల, జూన్ 4 : చౌడాపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ఉపాధ్యాయులు 5వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులను 6వ తరగతిలో అడ్మిషన్ చేశారు. అంగన్వాడీలో చదువుతున్న చిన్నారులను పాఠశాలలో 1వ తరగతిలో అడ్మిషన్ చేయించారు. కార్యక్రమంలో చౌడాపూర్ ఎంపీటీసీ శంకర్, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తిమ్యనాయక్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శశిధర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య
బషీరాబాద్, జూన్ 4 : బడిబాట కార్యక్రమంలో భాగంగా శనివారం మండలంలోని ఉపాధ్యాయులు వారి గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి సర్కార్ పాఠశాలలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పిల్లల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లభిస్తుందన్నారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు హీర్యానాయక్, నర్సింగ్‌రావు, ఉపాధ్యాయులు అన్నపూర్ణ, రవికాంత్, పద్మమ్మ, బాలమని, అనసూయ, రెడ్డిఘణపూర్ ఉప సర్పంచ్ వెంకటయ్య ఉన్నారు.