నందిగామ, జూన్ 4 : మహానీయుల స్ఫూర్తితో సమాజ సేవలో ముందుంటున్నారు యువకులు. సేవే లక్ష్యంగా. విద్య, వైద్య, క్రీడా, సామాజిక సేవా రంగాల్లో అనేక కార్యక్రమాలు చేపడుతూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. నందిగామ గ్రామానికి చెందిన గణేశ్ యువజన సంఘం అధ్యక్షుడు, ఎన్వైకే మండల కన్వీనర్ దాసరి శ్రీశైలంయాదవ్ ఆధ్వర్యంలో యువజన సంఘాలు విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ, రక్తదానం, స్వచ్ఛభారత్, క్రీడాపోటీలు, ఓటు హక్కుపై అవగాహన, హరితహారంలో మొక్కలు నాటడం, పర్యావరణ పరిరక్షణ, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలపై ప్రజలకు అవగాహన కల్పించడం వంటి అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననలు పొందుతున్నారు.
ప్రజలకు అవగాహన..
సమాజంపై ప్రతిఒక్కరికి అవగాహన ఉండాలనే లక్ష్యంతో ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు ఎన్వైకే, గణేశ్ యువజన సంఘం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు, యువకులు చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా ఉండేందుకు ప్రత్యేక డిజిటల్ తరగతుల ద్వారా వారికి ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలను చైతన్య వంతులను చేసేందుకు గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యావంతులు, పోలీసులతో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి వారికి అన్ని విధాలుగా అవగాహన కల్పిస్తున్నారు.
గణేశ్ యువజన సంఘానికి మూడు అవార్డులు
నెహ్రూ యువ కేంద్రం, గణేశ్ యువజన సంఘం ఆధ్వర్యంలో మండలంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు, యువకులకు క్రీడా పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందిస్తున్నారు. పోటీల్లో ఆడగలిగే సత్తా ఉన్న వారిని గుర్తించి నెహ్రూ యువ కేంద్రం సహకారంతో జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలకు తీసుకెళ్తూ వారికి అనేక రకాలుగా ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. అంతే కాకుండా మండల పరిధిలోని పలు యువజన సంఘాలకు సామాజిక సేవా కార్యక్రమాల్లో జిల్లా, రాష్ట్రస్థాయి అవార్డులు అందుకున్నారు. నందిగామ మండల కేంద్రంలోని గణేశ్ యువజన సంఘం ఆధ్వర్యంలో యూత్ సభ్యులు స్వచ్ఛభారత్, హరితహారంలో భాగంగా మొక్కలు నాటడం, క్రీడాపోటీలు నిర్వహణ సామాజిక సేవా కార్యక్రమాలో చురుగ్గా పాల్గొనడంతో 2019లో జిల్లా మొదటి బహుమతిని, 2020లో జిల్లా స్థాయి స్వచ్ఛ భారత్ అవార్డు, 2021లో జిల్లా ఉత్తమ స్థాయి అవార్డును గణేశ్ యువజన సంఘం సభ్యులు అందుకున్నారు.
సమాజంపై అవగాహన కలిగి ఉండాలి
సమాజంపై యువత అవగాహన కలిగి ఉండాలని, ఇప్పటికే ఎన్వైకేఎస్ ఆధ్వర్యంలో యువతకు సమాజంపై అవగాహన కల్పిసున్నాం. యువత తోడ్పాటుతో ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు కృషి చేస్తున్నాం. ప్రజలకు పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, మరుగుదొడ్ల వినియోగం, నిరక్షరాస్యులు ప్రభుత్వ పథకాలు వినియోగించుకునే విధంగా అవగాహన కల్పిస్తున్నాం. గ్రామాల్లో మరిన్ని సమాజిక సేవా కార్యక్రమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం.
– దాసరి శ్రీశైలం యాదవ్, గణేశ్ యూత్ అధ్యక్షుడు, ఎన్వైకే నందిగామ మండల కన్వీనర్