రంగారెడ్డి, జూన్ 4 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు జోరుగా సాగుతుండగా.. చెల్లింపుల్లో జాప్యం లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బిల్లింగ్ పూర్తయిన 24 గంటల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులను జమ చేస్తున్నారు. కాగా, జిల్లాలో ధాన్యం సేకరణ ఊపందుకున్నది. ఇప్పటికీ 3,387 మంది అన్నదాతల నుంచి రూ.2.86కోట్ల విలువైన 14,642 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని జిల్లా యంత్రాంగం సేకరించింది. యాసంగిలో 47,231 ఎకరాల్లో వరి సాగవగా.. 70వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించిన రైతులకు చెల్లింపుల్లో జాప్యం లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బిల్లింగ్ పూర్తయిన 24గంటల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులను జమ చేస్తున్నారు. జిల్లాలోని 36 కొనుగోలు కేంద్రాలకు ధాన్యం దండిగా వస్తున్నది. యాసంగి సీజన్లో 47,231 ఎకరాల్లో వరి సాగు కాగా.. 1.18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని పౌరసరఫరాల శాఖ అధికారులు అంచ నా వేస్తున్నారు.
అయితే జిల్లా అవసరాలు పోను కొనుగోలు కేంద్రా ల ద్వారా 70 వేల మెట్రిక్ టన్ను ల ధాన్యాన్ని సేకరించాలని జిల్లా అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. అదేవిధంగా ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం కొనబోమని స్పష్టం చేయడంతో రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ, వాణిజ్య పంటలను సాగు చేసి అధిక లాభాలను పొందాలని ప్రభుత్వం సూచిస్తున్నది. రూ.1960 మద్దతు ధరతో రైతుల నుంచి ప్రభుత్వం ధాన్యాన్ని సేకరిస్తున్నది. జిల్లాలో 42 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు.
రూ.2.77 కోట్ల చెల్లింపులు పూర్తి
రంగారెడ్డి జిల్లాలోని 36 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 14,642 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరిగింది. ధాన్యాన్ని విక్రయించిన రైతులకు డబ్బులను సత్వరం చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నాం. బిల్లులు పూర్తైన 24 గంటల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బులను జమ చేస్తున్నాం. కాగా ఇప్పటివరకు రూ.2.77 కోట్ల డబ్బుల చెల్లింపులు పూర్తయ్యాయి. -తిరుపతిరావు, జిల్లా అదనపు కలెక్టర్
14,642 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
జిల్లాలో యాసంగి సీజన్‌కు సంబంధించి ఇప్పటివరకు 14,642 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 28 కొనుగోలు కేంద్రాల ద్వారా అధికారులు సేకరించారు. అత్యధికంగా మంచాల మండలంలోని బోడకొండలో 1,546 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. అదేవిధంగా ఆమనగల్లులో 768 మెట్రిక్ టన్నులు, కడ్తాల్‌లో 141, ముడ్విన్లో 827, చుక్కాపూర్లో 176, పడ్కల్లో 284, గట్టు ఇప్పలపల్లిలో 62, మేకగూడలో 174, కొత్తపేటలో 184, తొమ్మిదిరేకులలో 190, చేగూర్‌లో 123, షాద్‌నగర్‌లో 225, కొందుర్గులో 262, చౌదరిగూడెంలో 590, మోకిలలో 325, మహేశ్వరంలో 28, కందుకూరులో 96, ఆర్కేమైలారం లో 972, పొల్కంపల్లిలో 373, తలకొండపల్లిలో 373, వెల్జాల్లో 445, యాచారంలో 325, బాచారంలో 110, రాజ్పోల్లో 325, పటేల్‌గూడలో 159, పాలమాకులలో 24, గౌరెల్లిలో 884, ఆమనగల్లులో 895, అర్కపల్లిలో 771, ఇబ్రహీంపట్నంలో 195, కొహెడలో 107, బండరావిర్యాలలో 289, నోములలో 771, సర్దార్‌నగర్‌లో 93, చింతపట్లలో 773, నందివనపర్తిలో 342, చిత్తాపూర్లో 340 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. 3,387 మంది రైతుల నుంచి రూ. 2.86 కోట్ల విలువైన ధాన్యాన్ని సేకరించారు. రైతు లు ధాన్యాన్ని విక్రయించేందుకు ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకు గ్రామస్థాయిలోనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిం ది. అంతేకాకుండా ఒకేసారి రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని విక్రయించేందుకు రాకుం డా టోకెన్లను అధికారులు జారీ చేస్తున్నారు.