పరిగి, జూన్ 4 : బడీడు పిల్లలందరూ బడుల్లో చేరేలా చర్యలు తీసుకోవాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల అధికారులకు సూచించారు. శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బడీడు పిల్లలందరూ తప్పనిసరిగా పాఠశాలలో చేర్పించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో 696 మంది పిల్లలను డ్రాపౌట్లుగా గుర్తించామని, వారందరినీ సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక చొరవ చూపి పాఠశాలల్లో చేర్చాలన్నారు. ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులను భాగస్వాములను చేయాలని సూచించారు. బడీడు పిల్లలను గుర్తించడంలో చైల్డ్‌లైన్ ప్రతినిధులు, అంగన్వాడీ సిబ్బంది సేవలను తీసుకోవాలని చెప్పారు.
బడిబాట పూర్తయ్యే లోపు జిల్లాలో బాల కార్మికులు లేకుండా చూడాలని కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్‌కు సూచించారు. వసతిగృహాల్లో మెరుగైన సౌకర్యాల కల్పనకు, భవనాల మరమ్మతుకు అయ్యే ఖర్చులకు సంబంధించి అంచనాలు సమర్పించాల్సిందిగా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్చార్జి డీఆర్వో విజయకుమారి, జిల్లా విద్యా శాఖ అధికారి రేణుకాదేవి, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కోటాజీ, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి మల్లేశం, జిల్లా మైనార్టీ అభివృద్ధి అధికారి సుధారాణి, జిల్లా వెనుకబడిన కులాల అభివృద్ధి అధికారి ఉపేందర్, కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్, బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా కన్వీనర్ శివరాజ్, చైల్డ్‌లైన్ కో-ఆర్డినేటర్ శ్రీనివాస్, ప్రతినిధి వెంకటేశ్ పాల్గొన్నారు.