రంగారెడ్డి, జూన్ 3, (నమస్తే తెలంగాణ): ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం అమల్లోకి తీసుకొస్తున్న దృష్ట్యా సక్సెస్ అయ్యేలా జిల్లా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఈ ఏడాది ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఇంగ్లిష్ మీడియాన్ని అమల్లోకి తీసుకురానున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం నుంచి బడిబాట కార్యక్రమాన్ని చేపట్టారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా ఊరూరా ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం అమలుపై ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృత ప్రచారం నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడంతోపాటు నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బడిబాట కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అన్ని హాబిటేషన్లలో బడీడు పిల్లలను గుర్తించి దగ్గర్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించనున్నారు. అంగన్వాడీల్లోని ఐదేండ్లలోపు చిన్నారులను గుర్తించి వారిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడంతోపాటు ఎవరైతే 5, 8 తరగతులు పూర్తి అయిందో సంబంధిత విద్యార్థులు పదో తరగతి వరకు కొనసాగేలా చర్యలు చేపట్టనున్నారు. మరోవైపు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కడైతే తక్కువ సంఖ్యలో విద్యార్థులున్నారో సంబంధిత స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు చర్యలు చేపట్టనున్నారు.
ఈనెల 30 వరకు బడిబాట..
జిల్లాలో బడిబాట కార్యక్రమం షురూ అయ్యింది. ఈనెల 30 వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అయితే బడిబాట కార్యక్రమంలో భాగంగా ఈనెల 3 నుంచి 10 వరకు గ్రామాల వారీగా విద్యార్థుల ఎన్రోల్మెంట్పై విస్తృత ప్రచారం చేయనున్నారు. ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు ఎన్రోల్మెంట్పై ఊరూరా అవగాహన కల్పించనున్నారు. ఈనెల 13 నుంచి 30 వరకు స్కూళ్ల వారీగా విద్యార్థుల సంఖ్యను పెంచేలా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ను పెంచడంతోపాటు ఆంగ్ల మాధ్యమం అమలుపై విస్తృత ప్రచారం నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ బడిబాట కార్యక్రమాన్ని చేపట్టింది. ఇంటింటి సర్వే నిర్వహించి, ర్యాలీలు నిర్వహించి, కరపత్రాలను పంపిణీ చేయనున్నారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులకు సంబంధించి ఉపాధ్యాయులు తెలియజేయనున్నారు. బడిబాట కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులందరూ పాల్గొననున్నారు. బాల కార్మికులను గుర్తించి పాఠశాలల్లో చేర్పించనున్నారు. ఇంగ్లిష్ మీడియం అమలుతోపాటు ఇంగ్లిష్, తెలుగు భాషాల్లో పుస్తకాలను పంపిణీ చేయనున్నమనేది వివరించనున్నారు. ఇంగ్లిష్ మీడియాన్ని పక్కాగా అమలు చేసేందుకుగాను ఉపాధ్యాయులకు శిక్షణనిచ్చినట్లు తల్లిదండ్రులకు తెలుపనున్నారు.
ఆంగ్ల మాధ్యమంపై విస్తృత ప్రచారం..- డీఈవో సుశీంధ్రరావు
ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెడుతున్న ఆంగ్ల మాధ్యమంపై జిల్లావ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సుశీంధ్రరావు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని అమల్లోకి తీసుకొస్తున్న దృష్ట్యా గ్రామాల నుంచి ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లే పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి, ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా చర్యలు చేపట్టనున్నామన్నారు. మన ఊరు- మన బడిలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు చర్యలు చేపట్టిన దృష్ట్యా ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ పెరిగే అవకాశాలున్నట్లు ఆయన వెల్లడించారు. మరోవైపు జిల్లాలోని 1600 అంగన్వాడీ కేంద్రాల్లోని 33,820 మందిని, ఐదో తరగతి పూర్తైన విద్యార్థులందరిని ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించడంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.