షాద్‌నగర్ రూరల్, జూన్ 3 : గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు రాష్ట్ర సర్కార్ మరో అడుగు ముందుకు వేసింది. ఇప్పటికే క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం గ్రామల్లో క్రీడా మైదానాలను ఏర్పాటు చేస్తూ మరింత ఉత్తేజాన్ని నింపుతున్నది. గ్రామీణ యువతీయువకుల్లోని నైపుణ్యత మరుగునపడకూడదన్న ఉద్దేశంతో వారికి రాష్ట్ర ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తున్నది. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తే వారికి మంచి భవిష్యత్తు ఉంటుందన్న సదుద్దేశంతోనే క్రీడా మైదానాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నది. పల్లెపల్లెనా క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తుండడంతో గ్రామీణ యువతీయువకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
క్రీడా మైదానాలు ఇలా..
ప్రభుత్వ అనుమతులతో రియల్టర్లు చేసిన వెంచర్లలో గ్రామపంచాయతీకీ ఇచ్చిన స్థలంలో, ప్రభుత్వ స్థలాల్లో తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మైదానాల్లో ఆహ్లాదాన్ని అందించేలా మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సుమారు ఎకరం స్థలంలో మైదానాన్ని ఏర్పాటు చేసేందుకు ఎన్ఆర్జీఎస్ నిధుల నుంచి రూ.4లక్షలను ప్రభ్వుం కేటాయిస్తున్నది. దాతల సహకారంతో వివిధ ఆటపరికరాలను సమకూర్చుకోవచ్చు.
ఎలికట్టలో కనువిందు చేస్తున్న క్రీడా మైదానం..
ఫరూఖ్‌నగర్ మండలంలోని ఎలికట్ట గ్రామ శివారులో ఏర్పాటు చేసిన క్రీడా మైదానం క్రీడాకారులను ఆకట్టుకుంటున్నది. ఎకరం స్థలంలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణం కనువిందు చేస్తున్నది. ఈ మైదానాన్ని ప్రభుత్వ నిధులతో పాటు దాతల సహకరంతో తీర్చిదిద్దారు. వాల్‌బాల్, షెటిల్, కోకో వంటి క్రీడలకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేశారు.
క్రీడాకారుల ప్రతిభ వెలికి..
తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభ బయటకు వస్తున్నది. గ్రామంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు కావడం సంతోషకరం. ప్రభుత్వ నిధులతో పాటు దాతల సహకారంతో మైదానాన్ని తీర్చిదిద్దాం. సహకరించిన ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు.
– సాయిప్రసాద్, సర్పంచ్ ఎలికట్ట
ప్రతిభను చూపుతాం..
గ్రామంలోని క్రీడా మైదానంలో నిత్యం ప్రాక్టీస్ చేసి ప్రతిభను చూపుతాం. మా క్రీడా ప్రాంగణం ఏర్పాటు కావడం సంతోషకరం. గ్రామీణ యువతీయువకుల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యం వెలికి వచ్చే అవకాశం ఉన్నది. తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
– సాయికుమార్, క్రీడాకారుడు, ఎలికట్ట గ్రామం
చాలా సంతోషంగా ఉన్నది..
గ్రామంలో క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉన్నది. అందుబాటులో క్రీడా ప్రాంగణం లేక ఇప్పటివరకు క్రీడలకు దూరంగా ఉన్నాం. ప్రస్తుతం ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎలికట్టలో మైదానం ఉండడం ఆనందంగా ఉన్నది.
– వేణు, క్రీడాకారుడు, ఎలికట్ట గ్రామం