షాబాద్, జూన్ 3 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మన ఊరు-మనబడి కార్యక్రమంతో సర్కార్ బడులకు మహర్దశ కలిగిందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్ మండలం సర్దార్‌నగర్, చేవెళ్ల మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్సీలు జనార్దన్‌రెడ్డి, సురభి వాణీదేవి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్‌తో కలిసి బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్నారులతో అక్షరాలు దిద్దించారు. అనంతరం పాఠశాలల్లో మన ఊరు-మన బడి కార్యక్రమంలో మంజూరైన అదనపు తరగతి భవనాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మన ఊరు-మనబడి కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా రూ. 7వేల కోట్లతో పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామన్నారు.
పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో ఈ ఏడాది నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం అమలవుతుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలని సూచించారు. హరితహారంలో భాగంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి నీరుపోసి సంరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సుశీంధర్‌రావు, డీసీఏంఎస్ చైర్మన్ పి.కృష్ణారెడ్డి, జడ్పీ సీఈవో దిలీప్‌కుమార్, డీపీవో శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవో వేణుమాధవ్‌రావు, జడ్పీటీసీలు పట్నం అవినాశ్‌రెడ్డి, మర్పల్లి మాలతి, ఎంపీపీలు కోట్ల ప్రశాంతిరెడ్డి, మల్గారి విజయలక్ష్మి, ఎంపీడీవోలు అనురాధ, రాజ్‌కుమార్, తహసీల్దార్లు సైదులు, శ్రీనివాస్, ఎంఈవోలు శంకర్‌రాథోడ్, అక్బర్, సర్పంచులు ప్రణతి, స్వరూప, టీఆర్ఎస్ మండలాల అధ్యక్షులు ప్రభాకర్, నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు.