కొత్తూరు, జూన్ 3: కొత్తూరు ఏఎస్ఐ షేక్ అబ్దుల్లాకు మహోన్నత పోలీస్ సేవా పతకం వరించింది. శుక్రవారం రవీంద్రభారతిలో జరిగిన ఓ కార్యక్రమంలో హోంత్రి మహమూద్ అలీ ఏఎస్ఐ షేక్ అబ్దుల్లా మహోన్నత పోలీస్ సేవా పతకాన్ని అందజేశారు. 1989లో పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా చేరిన షేక్ అబ్దుల్లా అంచెలంచెలుగా ఎదిగి మహోన్నత సేవా పతకాన్ని అందుకున్నారు. 2018లో ఏఎస్ఐగా పదోన్నతి పొందారు. 2018 కంటే ముందు కొత్తకోట, మహబూబ్‌నగర్ వన్ టౌన్, ఆమనగల్లు, షాద్‌నగర్, సైబరాబాద్ స్పెషల్ టాస్క్‌పోర్స్‌లో విధులు నిర్వర్తించాడు. పోలీస్ శాఖలో చేసిన విశిష్ట సేవలకు గాను 2104లో అప్పటి ఉమ్మడి ప్రభుత్వం సేవా పతకాన్ని ఇచ్చింది. పోలీస్ శాఖలో 34 ఏండ్లుగా విధులు నిర్వర్తిస్తున్న షేక్ అబ్దుల్లా ఎన్నో బహుమతులు, ప్రశంసా పత్రాలను అందుకున్నారు. ఈ సందర్భంగా కొత్తూరు సీఐ బాలరాజు, ఎస్ఐ శంకర్, తన తోటి సిబ్బంది షేక్ అబ్దుల్లాను అభినందించారు.
షాద్‌నగర్ వాసికి..
షాద్‌నగర్ పట్టణంలోని తిరుమల కాలనీకి చెందని ఏఎస్ఐ బ్రహ్మయ్యకు ఉత్తమ సేవా అవార్డు దక్కింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో హోం మంత్రి మహమూద్ అలీ అవార్డులను అందజేసినట్లు ఆయన తెలిపారు. 1995 సంవత్సరంలో పోలీసు కానిస్టేబుల్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన 2011లో సికింద్రబాద్ ఆర్మీ ఈఎంఈ సెంటర్లో 14 నెలల పాటు జరిగిన శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబర్చి గోల్డ్‌మెడల్ సాధించాడు. హైదరాబాద్ డీజీపీ కార్యాలయంలో హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న బ్రహ్మయ్యకు ఇప్పటికే 3 ప్రశంసా పత్రాలను దక్కించుకున్నారు. బ్రహ్మయ్యకు ఉత్తమ సేవా పతకం రావడంపై కాలనీవాసులు, పట్టణ ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు.