కొడంగల్, జూన్ 3: పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో గ్రామాలు, పట్ట ణాలు ఎంతో పురోగతిని సాధించాయని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని మొదటి వార్డులో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు సంవత్సరాల క్రితం పట్టణంతో పాటు గ్రామాలు పరిశుభ్రత లోపించి ఉండేవన్నారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంతో గ్రామ, పట్టణ ప్రాంతాల్లో పరిశుభ్రతతో పాటు సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణాలు ఏర్పడి స్వచ్ఛత సంతరించుకున్నట్లు తెలిపారు. నాటి చెత్తకుప్పల స్థలాలు నేడు పల్లె ప్రకృతి వనాలతో దర్శనమిస్తున్నాయన్నారు. పల్లె, పట్టణ ప్రగతిలో ఏర్పాటైన కమిటీలు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను గుర్తించి పరిష్కరించాలని ఆదేశించారు. ఈనెల 13వ తేదీన మంత్రి హరీశ్‌రావు కొడంగల్ రానున్నారని, 50 పడకల దవాఖాన, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, డయాలసిస్ సెంటర్ ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. వీటితో పాటు మున్సిపల్ కార్యాలయ భవనానికి, పార్క్, కొడంగల్ పెద్ద చెరువు మర మ్మతు పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.
అనంతరం మున్సి పల్లో కొనసాగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించి కాంట్రాక్టర్‌కు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్‌రెడ్డి, వైస్ చైర్మన్ ఉషారాణి, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు రమేశ్‌రెడ్డి, కౌన్సిలర్లు మధుసూదన్‌యాదవ్, రమేశ్, పీఏసీఎస్ అధ్యక్షుడడు కటకం శివకుమార్, మున్సిపల్ కమిషనర్ నాగరాజుతో పాటు రెవెన్యూ, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధి కోసమే ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టిందని బొంరాస్‌పేట మండల ప్రత్యేకాధికారి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. మండలంలోని తుంకిమెట్ల, బుర్రితండా, నాందార్‌పూర్, ఏర్పుమళ్ల గ్రామాల్లో నిర్వహించిన పల్లె ప్రగతి గ్రామ సభల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. దౌల్తాబాద్ మండలంలో 33 గ్రామపంచాయతీలో వచ్చిన సమస్యలను సత్వరం పరిష్కరించాలని ఎంపీడీవో తిరుమలస్వామి అధికారులకు సూచించారు.