‘ఈ నెల 3 నుంచి ప్రారంభమయ్యే పల్లె, పట్టణ ప్రగతి, బడిబాట కార్యక్రమాలను విజయవంతం చేయండి.. ప్రతి పల్లె, పట్టణాన్ని సుందరంగా మార్చాలి..’ అని విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం మద్గుల్ చిట్టెంపల్లిలోని డీపీఆర్సీ భవనంలో పల్లె, పట్టణ ప్రగతిపై నిర్వహించిన సన్నాహక సమావేశంలో మంత్రి మాట్లాడారు. పల్లె, పట్టణాల్లో పచ్చదనాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలన్నారు. హరితహారంలో భాగంగా రోడ్ల వెంట నాటే మొక్కలు 6 నుంచి 7 అడుగుల ఎత్తు ఉండాలని సూచించారు. ప్రతి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. – పరిగి, మే 31
పరిగి, మే 31: పల్లెలు, పట్టణాలను సుందరంగా మార్చాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం మద్గుల్చిట్టెంపల్లిలోని డీపీఆర్సీ భవనంలో పల్లె, పట్టణ ప్రగతిపై జరిగిన సన్నాహక సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వికారాబాద్ జిల్లాలోని పల్లెలు స్వచ్ఛతకు నిలయాలుగా మారాలన్నారు. ఈనెల 3వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పల్లె, పట్ట ణ ప్రగతి, బడిబాట కార్యక్రమాలను జయప్రదం చేయాలని అధికారులకు సూచించారు. పల్లె, పట్ట ణ ప్రగతిలో భాగంగా 15 రోజుల పాటు పాదయాత్రలు చేస్తూ ప్రజలతో మమేకం కావాలని, మున్సిపాలిటీలు కూడా గ్రామపంచాయతీల మాదిరిగా మారాలని, వార్డును యూనిట్‌గా తీసుకొని పనులను చేపట్టాలని మంత్రి సూచించారు.
రాష్ట్రంలో 50శాతం ఉన్న పట్టణ ప్రాంతాల్లో ‘పట్టణ ప్రగతి’ తో సమూల మార్పులు రావాలని, జిల్లాలోని అన్ని గ్రామాల్లో తెలంగాణ క్రీడాప్రాంగణాల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. క్రీడలకు సం బంధించి యువకులతో ప్రత్యేక కమిటీలను ఏర్పా టు చేసేందుకు ఎమ్మెల్యేలు చొరవ చూపాలన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున జిల్లాలో కొన్ని ప్రాంగణాలను ప్రారంభించడం జరుగుతుందని మంత్రి సబితారెడ్డి తెలిపారు. పల్లె, పట్టణ కమిటీ లు బాగా పనిచేసేలా చూడాలన్నారు. జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో డంపింగ్‌యార్డులు, వైకుంఠధామాలు, నర్సరీలు, పల్లెప్రకృతివనాలు, ట్రాక్టర్లు, ట్రాలీ, ట్యాంకర్లు అందుబాటులోకి వచ్చాయని, ఈసారి హరితహారంలో రోడ్లకు ఇరువైపులా విరివిగా మొక్కలను నాటాలని మంత్రి సూచించారు.
అటవీశాఖ ఆధ్వర్యంలోని నర్సరీల్లో పెద్ద మొక్కలు అందుబాటులో ఉంటే తెచ్చుకోవాలని, లేనియెడల గ్రీన్ బడ్జెట్ ద్వారా కొనుగోలు చేయాలన్నారు. పట్టణాల్లో గ్రీన్ బడ్జెట్ కోసం కేటాయించిన నిధులు పూర్తిస్థాయిలో వినియోగించాలని అధికారులకు సూచించారు. మూడు, నాల్గో విడుత పట్టణ ప్రగతి సందర్భంగా దృష్టికొచ్చిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నా రు. జూన్ 3వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ‘బడిబాట’ను జయప్రదం చేయడంతోపాటు జూన్ 13 వ తేదీన బడుల పునఃప్రారంభం రోజున విద్యార్థు ల తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. రానున్న విద్యాసంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన జరుగుతుంద ని, ఈ విషయాన్ని పిల్లల తల్లిదండ్రులకు తెలిపి నమోదు శాతం పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.
అనంతరం వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ సునీతా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ పల్లె, పట్టణ ప్రగతిని జయప్రదం చేయాలని, గ్రామాలు, పట్టణాల్లో పాడుబడ్డ బావుల పూడ్చివేత, మురికి కాలువలు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. గతంలోని ఏవైనా పనులు పెండింగ్‌లో ఉంటే వా టిని పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లోని ప్రజలు మరుగుదొడ్లు నిర్మించుకున్నా వాటిని వినియోగించడంలేదని, ఈ విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలని సూచించారు.
ప్రజాప్రతినిధులు, అధికారులు ఏమైనా సూచనలు చేస్తే వాటిని పరిగణనలోకి తీసుకొని అభివృద్ధి పనుల కోసం జిల్లా పరిషత్ నుంచి నిధులను కేటాయిస్తానని తెలిపారు. కార్యక్రమంలో వికారాబాద్, చేవెళ్ల, పరిగి ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కాలె యాదయ్య, కొప్పుల మహేశ్‌రెడ్డి, కలెక్టర్ నిఖిల, బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్‌పటేల్, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, జిల్లా గ్రం థాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణ, జడ్పీ సీఈవో జానకీరెడ్డి, డీఆర్డీవో కృష్ణన్, డీపీవో మల్లారెడ్డి, డీఈవో రేణుకాదేవి, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
అర్బన్ పార్కు స్థల పరిశీలన
పరిగి, మే 31: వికారాబాద్‌లోని అనంతగిరిలో ఏర్పాటు చేయనున్న అర్బన్ పార్కు స్థలాన్ని అదేవిధంగా నర్సరీని మంగళవారం మంత్రి సబితారెడ్డి ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, మహేశ్‌రెడ్డి, కాలె యాదయ్య, కలెక్టర్ నిఖిల, బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్‌పటేల్, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్‌తో కలిసి పరిశీలించారు. ఈ సం దర్భంగా ఆమె మాట్లాడుతూ పార్కులో క్రీడా పరికరాలతోపాటు సైక్లింగ్, వాకింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.