కులకచర్ల, మే 31 : స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు భారీగా నిధులను కేటాయిస్తున్నది. ముఖ్యంగా పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించి చెత్తరహితగ్రామాలుగా మార్చేలా ప్రభుత్వం కృషి చేస్తున్నది. ప్రతి పంచాయతీకి ట్రాక్టర్ సౌకర్యం కల్పించి గ్రామాలను శుభ్రంగా ఉంచేందుకు పారిశుధ్య కార్మికులను నియమించింది. ప్రతిరోజూ చెత్తను సేకరిస్తూ స్వచ్ఛత గ్రామాలుగా మార్చేందుకు ప్రణాళికలు చేపట్టాలని పంచాయతీలకు సూచించింది. కులకచర్ల పంచాయతీలో చెత్తనిర్వహణ, పారిశుధ్య విషయంలో పంచాయతీ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది.
ఇంటికి రెండు చెత్త బుట్టలు
చెత్తను వేయడానికి పంచాయతీ నుంచి రెండు చెత్త బుట్టలు కూడా అందజేశారు. తడి, పొడి చెత్తను వేరుగా పంచాయతీ ట్రాక్టర్లో వేస్తున్నారు. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ గ్రామ పంచాయతీగా చేసేందుకు అధికారులు ఎంపిక చేసిన కులకచర్ల గ్రామ పంచాయతీ సత్ఫలితాలను అందిస్తున్నది. మండల కేంద్రంలో సుమారు 10వేలకుపైగా జనాభా ఉన్నది. 1170 కుటుంబాలు ఉన్నాయి. 9మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు. గ్రామాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి మౌలిక సదుపాయాలను కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గ్రామాన్ని చెత్త రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నారు.
ప్రతి వీధిలో మురుగునీటి కాలువ
ప్రతి కాలనీలో మురుగునీటి వ్యవస్థను సక్రమంగా ఏర్పాటు చేసేందుకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో వీధుల్లో ఏర్పాటు చేసిన మురుగునీటి కాల్వలను శుభ్రం చేయడంతో పాటు మురుగునీరు నిల్వ ఉండకుండా పంచాయతీ ప్రత్యేక చొరవను చూపిస్తున్నది.
ప్రతి రోజూ చెత్త తరలింపు..
మండల కేంద్రంలో ప్రతి రోజూ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో 5 క్వింటాళ్ల చెత్తను ట్రాక్టర్ ద్వారా డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించి తడి, పొడి చెత్తను వేరు చేసి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు.
వర్మీకంపోస్ట్ ఎరువు తయారీ
సేకరించిన చెత్త ద్వారా డంపింగ్ యార్డు వద్ద వర్మీ కంపోస్టు ఎరువుకు మార్కెట్లో చాలా డిమాండ్ ఉన్నందున నేరుగా షెడ్లోనే మూడు కిలోల వానపాములు వదిలి ప్రతి నెల 125కిలోల సేంద్రియ ఎరువులు తయారు చేస్తున్నారు. కిలోకు రూ. 100వరకు ధర పలుకుతున్నది. నెలకు రూ. 12500వరకు పంచాయతీకి ఆదాయం వస్తున్నది.
సేంద్రియ ఎరువులపై రైతుల ఆసక్తి..
సేంద్రియ ఎరువు కొనుగోలుకు రైతులు సిద్ధపడుతున్నారు. రసాయనిక ఎరువులను కూరగాయల, పంటలకు ఉపయోగించడం వలన భూమి సారం పోతుందని భావించి సేంద్రియ ఎరువులపై ఆసక్తి చూపుతున్నారు.
శుభ్రంగా కాలనీలు..
కాలనీల్లోని ప్రజలకు తడి, పొడి చెత్త నిర్వహణ, రోడ్లు, కాలనీలు, ఇండ్ల మధ్య చెత్తను వేస్తే కలిగే అనర్థాలపై పంచాయతీ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఎక్కడా చెత్త వేయకుండా చెత్తరహిత గ్రామంగా మారింది.
స్వచ్ఛ గ్రామంగా మారుస్తున్నాం..
కులకచర్ల గ్రామాన్ని స్వచ్ఛత గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం. వార్డుల వారీగా ప్రజలకు తడి, పొడి చెత్త నిర్వహణపై అవగాహన కల్పించాం. ప్రతి రోజూ మూడు ట్రాక్టర్ల చెత్తను గ్రామం నుంచి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నాం. మురుగునీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు పంచాయతీ సిబ్బంది ద్వారా మురుగునీటి కాల్వలను శుభ్రం చేయిస్తున్నాం. కులకచర్ల పంచాయతీని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దుతాం.
– సౌమ్యావెంకట్‌రాంరెడ్డి, కులకచర్ల సర్పంచ్
సక్రమంగా చెత్త నిర్వహణ..
కులకచర్లను చెత్తరహిత గ్రామంగా తీర్చిదిద్దుతాం. గ్రామంలో చెత్తను బయట వేయరాదని సూచించాం. ఉదయాన్నే కాలనీల్లోకి వెళ్లి చెత్త నిర్వహణపై గ్రామస్తులకు తెలియజేస్తున్నాం. సేకరించిన చెత్త ద్వారా సేంద్రియ ఎరువులు తయారు చేస్తున్నాం. పంచాయతీలోని మొక్కలకు ఈ ఎరువులను వినియోగిస్తున్నాం.
– శ్రీనివాస్‌రెడ్డి,పంచాయతీ కార్యదర్శి కులకచర్ల