పరిగి, మే 30: వికారాబాద్‌లో జిల్లా కోర్టు ఏర్పాటుకు సంబంధిత అధికారులు చర్యలను ముమ్మరం చేశారు. కొత్త రెవెన్యూ జిల్లాలను జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్స్‌గా పరిగణిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో పనులు ఊపందుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తేదీ నుంచి జిల్లా కోర్టు సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వికారాబాద్ పట్టణంలో ప్రస్తుతమున్న 12వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు భవనంలోనే కొత్త జిల్లా కోర్టును ఏర్పాటు చేయనున్నారు. కాగా, కొత్తగా ఏర్పడనున్న జిల్లా కోర్టు, ఇతర అదనపు కోర్టుల భవనాల సముదాయం నిర్మాణానికి వికారాబాద్ శివారులోని ఆలంపల్లిలో 10 ఎకరాల భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
కొత్త రెవెన్యూ జిల్లాలను జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్‌గా పరిగణిస్తూ హై కోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో వికారాబాద్‌లో జిల్లా కోర్టు ఏర్పాటుకు సన్నాహాలు సాగుతున్నాయి. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తేదీ నుంచి వికారాబాద్ జిల్లా కోర్టును ప్రారంభించేందుకు అవసరమైన అన్ని చర్య లను అధికారులు తీసుకుంటున్నారు. వికారాబాద్ లో ప్రస్తుతం 12వ జిల్లా అదనపు జడ్జి కోర్టు, ఫ్యామి లీ కోర్టు, సీనియర్ సివిల్ జడ్జి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు కొనసాగుతున్నాయి. కొత్తగా 12వ జిల్లా అదనపు జిల్లా కోర్టు స్థానంలో ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ కోర్టు ఏర్పాటు కానున్నది.
దీంతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పోక్సో కేసుల ప్రత్యేక కోర్టు, వినియోగదారుల కోర్టు, స్పెషల్ ఎక్సైజ్ యాక్ట్ కోర్టు, ఎన్డీపీఎస్ చట్టం, మహిళలపై అత్యాచారం తదితర నేరాలను విచారించేందుకు జిల్లా స్థాయిలో కోర్టులు ఏర్పాటు కానున్నాయి. జిల్లా కోర్టు పరిధిలో వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ జూనియర్ సివిల్ కోర్టులు ఉంటాయి. వికారాబాద్ జూనియర్ సివిల్ కోర్టు పరిధిలో వికారాబాద్, ధారూర్, మోమిన్‌పేట, మర్పల్లి, నవాబుపేట, కోట్‌పల్లి, బంట్వారం మండలాలు…తాండూరు కోర్టు పరిధిలో తాండూరు, యా లాల, బషీరాబాద్, పెద్దేముల్.. పరిగి కోర్టు పరిధిలో పరిగి, దోమ, పూడూరు, కులకచర్ల, చౌడాపూర్.. కొడంగల్ కోర్టు పరిధిలో కొడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్ మండలాలు ఉంటాయి. ప్రస్తుతం 12వ జిల్లా అదనపు కోర్టు భవనంలోనే జిల్లా కోర్టు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు.
తీరనున్న కక్షిదారుల ఇబ్బందులు
కొత్తగా జిల్లా కోర్టు, ఇతర అదనపు కోర్టుల ఏర్పాటుతో జిల్లా ప్రజలకు మేలు జరుగనున్నది. పలు కేసుల్లోని కక్షిదారులకు ఇబ్బందులు తీరనున్నాయి. ఉమ్మడి జిల్లా లో జిల్లా కోర్టు ఎల్బీనగర్ లో ఉండటంతో ఈ కేసులకు సంబంధించిన వారందరూ అక్కడికి వెళ్లాల్సి వచ్చేది. ఇందుకోసం ఒకరోజు పూర్తిగా సమయం వెచ్చించాల్సి వచ్చే ది. మరికొందరు తమ న్యా యవాదులను కలిసేందుకు కూడా హైదరాబాద్ నగరానికి వెళ్లాల్సి రావడంతో ఇబ్బందు లు ఎదురయ్యేవి. ఇకపై జిల్లా కోర్టు వికారాబాద్‌లోనే ఏర్పా టు కానుండటంతో కక్షిదారుల ఇబ్బందులు తొలుగుతాయి. జిల్లాలోని 19 మండలాలకు సంబంధించిన జిల్లా స్థాయి కేసులు వికారాబాద్‌లో ఏర్పాటు కానున్న జిల్లా కోర్టుకు బదిలీ కానుండటంతో వారందరూ వికారాబాద్‌కు వెళ్లనున్నారు. తద్వారా సమయం ఆదా అవుతుందని పలువురు పేర్కొంటున్నారు.
జిల్లాల వారీగా బదిలీ కానున్న కేసులు
నూతనంగా ఏర్పడిన జిల్లాల వారీగా కొత్త జిల్లా కోర్టులు ఏర్పాటు కానుండటంతో వాటి పరిధిలోని మండలాలు, జిల్లాలను గుర్తించి కేసులను ఆయా ప్రాంతాల్లోని కోర్టులకు బదిలీ చేయనున్నారు. వికారాబాద్ జిల్లా పరిధిలోని మండలాలకు సంబంధించిన కేసులు వికారాబాద్ జిల్లాకు, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల పరిధిలోకి వెళ్లిన మండలాల కేసులు ఆయా ప్రాంతాల్లోని జిల్లా, జూనియర్ సివిల్ కోర్టుల పరిధిలోకి బదిలీ అవుతాయి. ఇందుకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతున్నది. పరిగి జూనియర్ సివిల్ కోర్టులో ఉన్నటువంటి గండీడ్, మహ్మదాబాద్ మండలాలకు సంబంధించిన 500 క్రిమినల్, 200 సివిల్ కేసులు మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోకి బది లీ అవుతాయి.
అలాగే వికారాబాద్‌లోని 12వ అదనపు జిల్లా కోర్టులో ఉన్నటువంటి చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి మండలాలకు సం బంధించిన సుమారు 600 కేసులు ఎల్బీనగర్లోని జిల్లా కోర్టుకు, వికారాబాద్‌లోని సీనియర్ సివిల్ కోర్టులోని సుమారు 500 కేసులు చేవెళ్ల కోర్టుకు బదిలీ కానున్నాయి. రంగారెడ్డి జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు, పోక్సో కోర్టు, వినియోగదారుల కోర్టు, స్పెషల్ ఎక్సైజ్ కోర్టు, ఎన్డీపీఎస్ చట్టం, మహిళలపై అత్యాచారం వంటి నేరాలను విచారించే కోర్టుల పరిధిలోని కేసులు వికారాబాద్‌లో ఏర్పాటు కాను న్న ఆయా కోర్టులకు బదిలీ చేస్తారు.
ఇప్పటివరకు మహబూబ్‌నగర్ జిల్లా కోర్టులో ఉన్నటువంటి కొడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్ మండలాలకు సంబంధించిన కేసులు వికారాబాద్ జిల్లా కోర్టుకు బది లీ కానున్నాయి. కొడంగల్ జూనియర్ సివిల్ కోర్టు పరిధిలో ఉన్నటువంటి కోస్గి, మద్దూర్ మండలాలకు సంబంధించిన కేసులు కోస్గిలో ఏర్పాటు కానున్న కొత్త కోర్టు పరిధిలోకి వస్తాయి. ఈ మేరకు కేసుల బదిలీ ప్రక్రియ పూర్తి కాగానే హైకోర్టు తుది జాబితాకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేయనున్నది.
ఆలంపల్లిలో..పది ఎకరాల భూమి కేటాయింపు
కొత్తగా ఏర్పాటు కానున్న జిల్లా కోర్టు, ఇతర అదనపు కోర్టుల భవనాల సముదాయం నిర్మాణానికి వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఆలంపల్లిలోని 10 ఎకరాల భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ స్థలంలో జిల్లా కోర్టు భవనం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పోక్సో కేసుల ప్రత్యేక కోర్టు, వినియోగదారుల కోర్టు, స్పెషల్ ఎక్సైజ్యాక్ట్ కోర్టు, ఎన్డీపీఎస్ చట్టం, మహిళలపై అత్యాచారం తదితర నేరాలను విచారించేందుకు జిల్లా స్థాయిలో ఏర్పాటు కానున్న కోర్టుల భవనాలను నిర్మించనున్నారు.