ఇబ్రహీంపట్నం, మే 30: పట్టణ ప్రగతితో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి మహర్దశ వచ్చింది. ప్రగతి పనుల కోసం ప్రభుత్వం ప్రతి నెలా రూ.23లక్షలు అందిస్తుండడంతో పట్నం అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్నది. పారిశుధ్య నిర్వహణను పకడ్బందీగా నిర్వహించడంతో స్వచ్ఛతలో మున్సిపాలిటీ మేటిగా నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో రాష్ట్రస్థాయి అవార్డును సైతం కైవసం చేసుకున్నది. నిత్యం ఇంటింటికెళ్లి చెత్త సేకరణ చేపట్టడం, మొక్కలకు నీరు అందిస్తుండడంతో మున్సిపాలిటీ పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడుతున్నది. ఇక సెంట్రల్ లైటింగ్ సిస్టమ్‌తో ప్రధాన రహదారులు రాత్రుల్లో విద్యుత్‌కాంతుల్లో మెరిసిపోతున్నాయి.
పట్టణ ప్రగతిలో భాగంగా ప్రభుత్వం మున్సిపాలిటీలకు అందిస్తున్న నిధులతో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ స్వచ్ఛతలో మేటిగా నిలిచింది. ప్రభుత్వం నుంచి ప్రతినెలా క్రమం తప్పకుండా వస్తున్న రూ.23 లక్షలతో మున్సిపాలిటీ అభివృద్ధి పథం లో ముందుకు దూసుకెళ్తున్నది. ఈ నిధులతో పట్టణంలో పారిశుధ్యం, పరిశుభ్రత, నర్సరీల నిర్వహణ వంటి పనులకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. దీంతో ఎటుచూసినా పచ్చదనమే కనిపిస్తున్నది. హరితహారంలో భాగంగా మున్సిపాలిటీలో.. రోడ్లకు ఇరువైపులా పెద్దఎత్తున నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ఆ దారుల్లో వెళ్లే వారికి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని 24 వార్డు లు చూపరులకు అద్దంలా కనిపిస్తున్నాయి. ప్రతిరోజూ 60 మంది వరకు పారిశుధ్య సిబ్బంది ఉదయం, సాయంత్రం సమయాల్లో రోడ్లను శుభ్రం చేస్తున్నారు. ఇండ్ల నుంచి సేకరించిన చెత్తాచెదారాన్ని ఒకచేట చేర్చి పట్టణ ప్రగతి నిధులతో కొనుగోలు చేసిన ట్రాక్టర్ సహాయంతో డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు. పారిశుధ్య కార్మికుల సేవలను స్థానికులు హర్షిస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని శేరిగూడ నుంచి ఖానాపూర్ వరకు గల సాగర్ రహదారిపై ఉన్న డివైడర్‌పై నాటిన మొక్కలు ఇబ్రహీంపట్నానికి కొత్త అందాన్ని తీసుకొచ్చాయి.
ఈ రోడ్డుపై రాకపోకలు సాగించే పాదచారులు, వాహనదారుల కు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. మరోవైపు హరితహారంలో భాగంగా అన్ని వార్డు ల్లో నాటిన మొక్కలు ఏపుగా పెరిగాయి. ఈ మొక్కలకు ప్రతిరోజూ నీటిని ట్యాంకర్ల ద్వారా అందిస్తున్నారు. అలాగే, హరితహారంలో భాగం గా మున్సిపాలిటీలో మరిన్ని మొక్కలను నాటేందుకు ఖానాపూర్ సమీపంలో జేబీ వెంచర్లో రెండు నర్సరీలను ఏర్పాటు చేశారు. ఈ నర్సరీల్లో సుమారు 2లక్షల వరకు మొక్కలు పెంచి సిద్ధంగా ఉంచారు.
రానున్న హరితహారంలో ఆ మొక్కలను మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో నాటేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రతినెలా రూ. 23 లక్షలు..
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి పట్టణ ప్రగతి లో భాగంగా ప్రతినెలా ప్రభుత్వం నుంచి రూ. 23 లక్షల నిధులు వస్తున్నాయి. వాటితో పట్టణంలో పారిశుధ్యం, హరితహారం మొక్కలు, నర్సరీల నిర్వహణ వంటి కార్యక్రమాలను అధికారులు చేపడుతున్నారు. అలాగే, మున్సిపాలిటీ పరిధిలోని సాగర్ రహదారిలో శేరిగూడ నుంచి ఖానాపూర్ వరకు ప్రత్యేకించి సెంట్రల్ లైటింగ్ సిస్టమ్‌ను ఇటీవల ఏర్పాటు చేశారు. ఆ దారిలో వెళ్లే వారిని ఎంతో ఆకట్టుకుంటున్నది. దీని ద్వారా రాత్రివేళల్లో ఇబ్రహీంపట్నం విద్యుత్ కాంతు ల్లో మెరిసిపోతున్నది. పట్టణ ప్రగతి నిధులను సద్వినియో గం చేసుకుంటూ మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు పాలకవర్గ సభ్యులు తెలిపారు.
మున్సిపాలిటీకి కొత్తకళ
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి పట్టణ ప్రగతిలో భాగంగా ప్రభుత్వం నుంచి ప్రతినెలా వస్తున్న నిధులతో కొత్తకళ వచ్చింది. మున్సిపాలిటీలో పారిశుధ్యం, వీధి దీపాల నిర్వహణ, గ్రీనరీ వంటి కార్యక్రమాలతో ఎంతో అభివృద్ధిని సాధించడం జరిగింది. ఓపెన్‌జిమ్, వాకర్ పార్కులను ఏర్పాటు చేశాం. మున్సిపాలిటీని గ్రీనరీలో జిల్లాలోనే మొదటిస్థానంలో నిలుపాలన్న పట్టుదలతో ముందుకెళ్తున్నాం.
– కప్పరి స్రవంతి, మున్సిపల్ చైర్పర్సన్
స్వచ్ఛతలో మేటి
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ స్వచ్ఛతలో జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిచింది. అంతేకాకుండా గతేడాది నవంబర్ నెలలో స్వచ్ఛ సర్వేక్షణ్‌లో రాష్ట్రస్థాయి అవార్డును కూడా అందుకున్నది. దీనిని స్ఫూర్తిగా తీసుకుని మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది ప్రతిరోజూ స్వచ్ఛతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. పారిశుధ్య సిబ్బంది ప్రత్యేక కృషితోనే ఈ అవార్డుకు ఇబ్రహీంపట్నం ఎంపికైనట్లు మున్సిపల్ చైర్పర్స న్ స్రవంతి అన్నారు. ప్రభుత్వం పట్టణ ప్రగతిలో భాగంగా ప్రతినెలా అందజేస్తున్న నిధులతో మున్సిపాలిటీని అభివృద్ధిపరంగా మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు.