షాబాద్, మే 29 : గత పాలకుల హయాంలో తాగునీటి కోసం ప్రజలు అనేక తిప్పలు పడ్డారు. గుక్కెడు నీటి కోసం బోర్లు, బావుల వద్దకు పరుగులు తీసి వరుసలో నిల్చుండేది. కుళాయిల వద్ద గంటల తరబడి ఖాళీ బిందెలతో బారులు తీరేది. తాగునీటి కోసం పని వదిలేసిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కన్నీటి కష్టాలు తీరాయి. తాగునీటి కోసం ఏ ఒక్క ఆడబిడ్డ కూడా ఖాళీ బిందెతో రోడ్లపైకి రావద్దనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతమైంది. ఇంటింటికీ నల్లానీరు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్న ముఖ్యమంత్రి రూ. వేల కోట్లతో మిషన్ భగీరథ ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు. రంగారెడ్డిజిల్లాలోని 18 మండలాల్లో మొత్తం రూ.1003 కోట్లతో మూడు మిషన్ భగీరథ ప్రాజెక్టులు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా జిల్లా వ్యాప్తంగా ఐదు నియోజవర్గాల్లోని 835 గ్రామాలకు ఇంటింటికీ నల్లాద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందుతున్నది. ఈ మూడు ప్రాజెక్టులకు 300 కిలోమీటర్ల దూరంలోని శ్రీశైలం నుంచి బ్యాక్‌వాటర్ పైపులైన్ల ద్వారా తీసుకువచ్చి ఈ ప్రాజెక్టుల్లో ఫిల్టర్ అయిన తర్వాత ఆయా గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తున్నారు. ఎండాకాలంలో కూడా తాగునీటి సమస్య లేకుండా సర్కార్ పకడ్బందీగా చర్యలు చేపడుతున్నది. ప్రతి ఇంటికి పుష్కలంగా తాగునీరు సరఫరా కావడంతో ప్రజలు, మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రూ.1003కోట్లతో మూడు ప్రాజెక్టులు..
రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా రూ.1003కోట్లతో మూడు మిషన్ భగీరథ ప్రాజెక్టులు నిర్మాణం చేపట్టారు. ఇందులో రూ. 275 కోట్లతో షాబాద్ మండలంలోని అంతారం వద్ద 40 ఎంఎల్డీ సామర్థ్యం ప్రాజెక్టు ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్, చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి మండలాల్లోని 214 గ్రామాలతో పాటు రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని 4 గ్రామాలకు ఇంటింటికీ నల్లానీరు అందుతున్నది. షాద్‌నగర్ మండలం కమ్మదనం వద్ద రూ. 260 కోట్లతో నిర్మాణం చేసిన 48 ఎంఎల్డీ సామర్థ్యం గల ప్రాజెక్టు నుంచి షాద్‌నగర్ నియోజకవర్గంలోని ఫరూఖ్‌నగర్, కొత్తూర్, కొందుర్గు, కేశంపేట్, చౌదరిగూడ, నందిగామ మండలాల్లోని 313 గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తున్నారు. రూ. 480 కోట్లతో నిర్మించిన 70 ఎంఎల్డీ సామర్థ్యం గల ముచ్చర్ల ప్రాజెక్టు నుంచి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్మేట్, మహేశ్వరం నియోజకవర్గంలోని కందూకూర్, మహేశ్వరం, రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని శంషాబాద్, గండీపేట మండలాల్లో మొత్తం 304 గ్రామాలకు ఇంటింటికీ నల్లాద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు.
తాగునీటి కష్టాలకు చెక్..
ఎండాకాలం వచ్చిందంటే గ్రామాల్లో తాగునీరు లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడేవారు. బిందెడు నీటి కోసం ఎన్నో కష్టాలు పడేవారు. తాగునీటి కోసం మహిళలు ఖాళీ బిందెలతో రోడ్లపైకి వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు చేసిన రోజులున్నాయి. గ్రామాల్లో ప్రజాప్రతినిధులు ట్యాంకర్ల ద్వారా ఇండ్లకు తాగునీరు సరఫరా చేసేవారు. 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆడబిడ్డల తాగునీటి కష్టాలు తీర్చేందుకు ప్రత్యేక ప్రణాళిక తయారు చేశారు. 2019 నాటికి ఇంటింటికీ నల్లాద్వారా స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అదే పనిలో రూ. వేల కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా మిషన్ భగీరథ ప్రాజెక్టులు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అనుకున్న గడువులోగా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నల్లానీరు అందించారు. గతంలో ఉన్న ప్రభుత్వాలు పేదలకోసం, మహిళల కోసం ఎన్నడూ పట్టించుకోలేదని, పేదల పక్షపాతిగా కేసీఆర్ చేస్తున్న పథకాలు ఎంతో బాగున్నాయని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎండాకాలంలో కూడా పుష్కలంగా తాగునీరు అందించడం గొప్ప పరిణామమని చెబుతున్నారు.
నీళ్ల తిప్పలు తీరినయి
సీఎం కేసీఆర్ సార్ వచ్చినంకా తాగడానికి నీళ్లకు తిప్పలు లేకుండా పోయింది. అప్పట్లో నీళ్ల కోసం బావుల కాడికి పోయేటోళ్లం. ఎండాకాలం వస్తే బిందెడు నీటి కోసం పొద్దుందాకా పడిగాపులు కాస్తుంటిమి. కానీ ఇప్పుడు ఇంటింటికీ నల్లాలు ఇచ్చి సర్కార్ నీళ్లు ఇవ్వడం చాలా బాగుంది.
– బాలమ్మ, నాగరగూడ(షాబాద్)
నీరు పుష్కలంగా వస్తున్నాయి
తాగునీరు రోజు బాగానే వస్తున్నాయి. మండుటెండల్లో వచ్చిందంటే నీళ్లకోసం అనేక తిప్పలు పడేవాళ్లం. కానీ ఇప్పుడు ఆ కష్టాలు లేకుండా పోయింది. సర్కార్ మిషన్ భగీరథ ద్వారా ఇస్తున్న ఇంటింటికీ నల్లానీరు పుష్కలంగా వస్తున్నాయి. రోజూ మూడు గంటల పాటు నీటి సరఫరాతోపాటు స్వచ్ఛమైన నీటిని పట్టుకుంటున్నాం. సర్కార్‌కు రుణపడి ఉంటాం.
-పావని, నాగరగూడ(షాబాద్)
భగీరథ నీటినే తాగుతున్నాం
మిషన్ భగీరథ నీటినే అందరం తాగుతున్నాం. ఇప్పుడు ఇంటింటికీ నల్లాలు వేసి నీళ్లు ఇస్తున్నారు. ఫిల్టర్ నీళ్లకన్నా ఈ నీళ్లే మంచిగున్నాయి. ఈ సర్కార్‌ను ఎప్పటికీ మరిచిపోం.
– రమాదేవి, నాగరగూడ(షాబాద్)
రూపాయి ఖర్చు లేదు..
ఇంటింటికీ తాగునీరు అందించే కార్యక్రమం ఎంతో గొప్పది. నేను గత 30 ఏండ్లుగా రాజకీయాల్లో ఉంటూ వివిధ పదవుల్లో ప్రజలకు సేవ చేస్తున్నా. కానీ ఏ ప్రభుత్వం కూడా తాగునీటి సరఫరా గురించి సరిగ్గా పట్టించుకోలేదు. ఎండాకాలం వచ్చిందంటే ప్రజలు ఖాళీ బిందెలతో రోడ్లపై ధర్నాలు చేసిన రోజులున్నాయి. రూ. వేలు ఖర్చు చేసి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసినా సరిపోయేవి కాదు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడాలేని విధంగా మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి రూపాయి ఖర్చు లేకుండా అన్ని ప్రభుత్వమే భరించి తాగునీరు సరఫరా చేయడం దేశానికే ఆదర్శంగా నిలిచింది.
– ఈదుల నర్సింహులుగౌడ్, సింగిల్ విండో మాజీ చైర్మన్ షాబాద్