కొడంగల్, మే 29: కొడంగల్ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు జోరందుకున్నాయి. రూ. 15కోట్లతో చేపట్టిన పనులు చివరి దశకు చేరుకోగా మరిన్ని అభివృద్ధి పనుల కోసం మంత్రి కేటీఆర్ ద్వారా రూ.10కోట్లు ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి మంజూరు చేయిం చారు. ఈ నిధులకు సంబంధించి అభివృద్ధి పనుల ప్రణాళిక పూర్తి కాగా టెండర్ ప్రక్రియ త్వరలో చేపట్టనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈనెల 24వ తేదీన ఎమ్మెల్యే ఉన్నతాధికారులతో పనుల పురోగతిపై సమీక్షించారు. వచ్చేనెల 6వ తేదీన మంత్రి హరీశ్‌రావు కొడంగల్ రానున్నారని, ఆలోగా పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
వచ్చే నెల 6వ తేదీన పట్టణంలో డిగ్రీ కళాశాల నూతన భవనం, 50 పడకల ప్రభుత్వ దవాఖాన, రూ.కోటితో నిర్మిస్తున్న వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్ భవనాలను మంత్రి ప్రారంభించనున్నారు. డిగ్రీ కళాశాల ప్రారంభం నాటి నుంచి కూడా సొంత భవనం లేక విద్యార్థులు నానా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిగ్రీ కళా శాల కొనసాగుతున్నది. ఇంటర్, డిగ్రీ తరగతులను ఉదయం, మధ్యాహ్నం సెక్షన్లుగా కొనసాగించే వారు. దాంతో రెండు కళాశాలల విద్యార్థులకు చదువులు సాగడంలో చాలా ఇబ్బందులు ఏర్పడేవి. కొంతకాలం తర్వాత ఇంటర్ కళాశాలకు నూతన భవనం నిర్మిం చారు. దీంతో ఇంటర్ విద్యార్థులకు పూర్తి స్థాయిలో తరగతులు కొనసాగాయి.
అదే విధంగా డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి ప్రభుత్వం స్థలాన్ని మంజూరు చేసి రూ. 4 కోట్ల 25 లక్షల వ్యయంతో నూతన భవన నిర్మాణం చేపట్టింది. వచ్చే విద్యా సంవత్స రానికి విద్యార్థులు నూతన భవనంలో చదువుకునే విధంగా ఎమ్మెల్యే పనులు పూర్తి చేయించారు. ప్రస్తుత సీహెచ్‌సీని 50 పడకల దవాఖానగా మార్చి రూ.3కోట్ల 25 లక్షలతో నూతన భవనాన్ని నిర్మించారు. ఈ దవాఖాన వైద్యవిధాన పరిషత్‌తో అనుసంధానం కావడంతో మెరుగైన చికిత్స అందనున్నది. కొడంగల్ పట్టణంలో ప్రతి బుధవారం సంత జరుగుతుంది. ఈ సంతలో స్థానిక వ్యాపారులతో పాటు పరిగి, షాద్‌నగర్ వంటి దూర ప్రాంతాల నుంచి కూడా వ్యాపారులు వస్తారు. ప్రస్తుతం అదే స్థలంలో రూ.కోటితో వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం చివరి దశకు చేరుకొని ప్రారంభానికి సిద్ధంగా ఉంది. అదేవిధంగా రూ.కోటితో పార్క్, రూ.కోటితో మున్సిపల్ కార్యాలయ భవనం, రూ.2లక్షలతో పోస్టుమార్టం భవన నిర్మాణాలకు మంత్రి శంకు స్థాపన చేయనున్నారు.