తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్యమే పరమావధిగా ముందుకు సాగుతున్నది. ఖర్చుతో కూడుకున్న వైద్యాన్ని సైతం ఉచితంగా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నది. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే మహేశ్వరం, వనస్థలిపురంలో డయాలసిస్ కేంద్రాలుండగా, మరో నాలుగు డయాలసిస్ కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. షాద్‌నగర్ ప్రభుత్వ దవాఖానలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటుకు అనుమతులు మంజూరు కాగా, ఒకట్రెండు నెలల్లో నియోజకవర్గ ప్రజలకు సేవలు అందనున్నాయి. అంతేకాకుండా ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, కొండాపూర్‌లలో డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి వైద్యారోగ్య శాఖ మంత్రి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగా, జిల్లా ఉన్నతాధికారులు వారం, పది రోజుల్లో ప్రతిపాదనలను సిద్ధం చేయనున్నారు.
రంగారెడ్డి, మే 26 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ ప్రభుత్వం వైద్య రంగానికి అధిక ప్రాధాన్యమిస్తూనే.. పేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యాన్ని అందించేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం అధిక మొత్తంలో నిధులను కేటాయిస్తూ, ప్రభుత్వ దవాఖానల రూపురేఖలను మార్చుతున్నది. ఈ ఎనిమిదేండ్ల కాలంలో సర్కారు దవాఖానలు బలోపేతం కావడంతో ప్రజలు క్యూ కడుతున్నారు. సాధారణ జ్వరం మొదలుకొని ప్రసవాలు, డయాలసిస్ వరకు ప్రజలకు ఉచితంగా చికిత్సలు అందుతున్నాయి. అయితే కిడ్నీ రోగులు రోజుకోజుకూ పెరుగుతుండడం, ప్రైవేట్ దవాఖానల్లో డయాలసిస్ ప్రక్రియకు రూ.లక్షల్లో ఖర్చు అవుతున్న నేపథ్యంలో పేదల సౌకర్యార్థం ప్రభుత్వం ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగా డయాలసిస్ సేవలను అందిం చేందుకు చర్యలు చేపట్టింది. దీని ద్వారా హైదరాబాద్‌కు లేదా జిల్లా కేంద్రానికి డయాలసిస్ రోగులు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే సేవలను పొందనున్నారు.
జిల్లాకు మరో నాలుగు..
జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగా డయాలసిస్ సేవలను విస్తరించేందుకు ప్రభు త్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలో రెండు డయాలసిస్ కేంద్రాలు.. వనస్థలిపురం ఏరియా దవాఖానతోపాటు మహేశ్వరం ప్రభుత్వ దవాఖానలో కొనసాగుతుండగా.. మరో నాలుగు కేంద్రాలు షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, కొండాపూర్లలోని ప్రభుత్వ ద వాఖానల్లో త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. వీటిలో షాద్‌నగర్ ప్రభుత్వ దవాఖానలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు కోసం ఇప్పటికే ప్రభుత్వం నుంచి అనుమతులు రాగా.. అవసరమైన యంత్రాలు, పరికరాలను ప్రభుత్వం త్వరలోనే సమకూర్చనున్నది. ఒకటి, రెండు నెలల్లో షాద్‌నగర్ నియోజకవర్గ ప్రజలకు ఉచిత డయాలసిస్ సేవలు అందుబాటులోకి రానున్నా యి. మరోవైపు ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, కొండాపూర్‌లలో డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగా, జిల్లా ఉన్నతాధికారులు డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. వారం రోజుల్లో ఆ ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందజేయనున్నారు. రెండు, మూ డు నెలల్లో చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, కొండాపూర్‌లలో డయాలసిస్ కేంద్రాలు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నట్లు సంబంధిత అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే జిల్లాలో రెండు కేంద్రాలు..
వనస్థలిపురం, మహేశ్వరం ప్రభుత్వ దవాఖానల్లోని డయాలసిస్ కేంద్రాల్లో ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలోని ప్రజలకు డయాలసిస్ సేవలు అందుతున్నాయి. ఈ రెండు కేంద్రాల్లో ప్రతిరోజూ దాదాపు 30 మందికి డయాలసిస్ చేస్తున్నారు. మహేశ్వరంలోని డయాలసిస్ కేంద్రంలో ఐదు డయాలసిస్ యంత్రాలుండగా ఐదు బెడ్లున్నా యి. అదేవిధంగా వనస్థలిపురం ఏరియా దవాఖానలోనూ ఐదు యంత్రాలు, ఐదు బెడ్లు ఉం డగా సుమారు 30 మంది కిడ్నీ బాధితులకు డయాలసిస్ సేవలందిస్తున్నారు.
త్వరలోనే షాద్‌నగర్‌లో సేవలు ప్రారంభం
రంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం వనస్థలిపురం, మహేశ్వరం ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగా డయాలసిస్ సేవలు రోగులకు అందుతున్నాయి. అయి తే డయాలసిస్ సేవలను విస్తరించే ప్రక్రియలో భాగంగా జిల్లాకు నాలుగు డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. షాద్‌నగర్‌లో డయాలసిస్ కేంద్రం ఏర్పాటుకు ఇప్పటికే ప్రభుత్వం నుంచి అనుమతులు రాగా.. త్వరలోనే సేవలు ప్రారంభం కానున్నాయి. అలాగే, ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, కొండాపూర్లలోనూ డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలను సిద్ధం చేసి పంపించనున్నాం. ప్రస్తుతం ఉన్న డయాలసిస్ కేంద్రాల ద్వారా ప్రతిరోజూ సుమారు 30 మంది కిడ్నీ బాధితులకు డయాలసిస్ సేవలను అందిస్తున్నాం.
– ఝాన్సీ, డీసీహెచ్ఎస్