పెద్దేముల్, మే 26 : ఎరువులు, పురుగు మందుల దుకాణాల డీలర్లు రైతులకు నిషేధిత విత్తనాలు, పురుగు మందులను విక్రయించరాదని తాండూరు అగ్రికల్చర్ ఏడీ రుద్రమూర్తి సూచించారు. గురువారం మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో వ్యవసాయ, పోలీసు శాఖ వారి ఆధ్వర్యంలో సంయుక్తంగా ఫెర్టిలైజర్ల దుకాణాల డీలర్లకు ప్రభుత్వ నియమ నిబంధనలను సూచిస్తూ అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏడీ రుద్రమూర్తి, పెద్దేముల్ ఎస్ఐ అబ్దుల్ రవూఫ్ మాట్లాడుతూ.. ఫెర్టిలైజర్ దుకాణాల యజమానులు ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను విక్రయించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా వ్యవసాయ శాఖలో పనిచేసే మండల వ్యవసాయ విస్తరణ అధికారులు ప్రతిరోజూ వారివారి క్లస్టర్లలోని రైతు వేదికల్లో అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ నెల 31 వరకు పీఎం కిసాన్ ఈకేవైసీని పూర్తిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏవో నజీరొద్దీన్, ఏఈవోలు స్వాతి, బాలకోటేశ్వర్లు, రజిత,లక్ష్మి, శివరాజ్, వినయ్ పాల్గొన్నారు.