తాండూరు రూరల్, మే 26 : గత కొన్నేండ్లుగా పరిష్కారం కాని సమస్యలు మన ఊరు-మన బడితో పరిష్కారం కానున్నాయి. తాండూరు మండలం, చెంగోల్ గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్ కొనసాగుతున్నది. మండల స్థాయిలో విద్యలో టాప్ లెవల్లో ఉంది. 2016-2017లో పదో తరగతిలో మండలస్థాయిలో వందకు వంద శాతం విద్యార్థులు పాసయ్యారు. ప్రస్తుతం 348 మంది విద్యార్థులున్నారు. ఈ పాఠశాలకు సమీప గ్రామాలైన గౌతాపూర్, చింతామణిపట్టణం, పర్వతాపూర్, అల్లాపూర్ గ్రామాల నుంచి విద్యార్థులు విద్యాభ్యాసం కోసం వస్తారు. కానీ విద్యార్థులకు ఆట స్థలం లేదు. పాఠశాల ఆవరణ మొత్తం పెద్ద పెద్ద బండరాళ్లతో ఉంది. గత ప్రభుత్వ హయాంలో అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి పాఠశాల యాజమాన్యం తీసుకెళ్లింది. కానీ పరిష్కారం కాలేదు. పాఠశాలకు కాంపౌండ్ వాల్ ఉన్నా సగం వరకే ఉంది. అదేవిధంగా విద్యార్థులకు మరుగుదొడ్లు, మూత్రశాలలు ఏర్పాటు చేశారు.
కానీ వాటిని వాడడం మానేశారు. కనీస వసతులు లేక వాటిని వదిలేశారు. ప్రధానంగా నీటి వసతి ఏర్పాటు చేయాల్సి ఉంది. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంలో పాఠశాలలోని సమస్యలు పరిష్కారం కానున్నాయి. విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కలుగన్నాయి. ప్రధానంగా పాఠశాలలో చిన్నచిన్న మరమ్మతులు, విద్యుత్ సమస్య, తరగతి గదులు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, ఫర్నిఛర్, గ్రీన్ బోర్డులు, కిచెన్ షెడ్లు, డైనింగ్ హాల్ వంటి సౌకర్యాలు కలుగనున్నాయి. ఇప్పటికే ఇంజినీరింగ్ అధికారులు పాఠశాలలో కొలతలు తీసుకెళ్లారు. విడుతలవారీగా పాఠశాలలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి జరుగనుంది. మొదటి విడుతలో పాఠశాలకు డైనింగ్ హాల్, చిన్నచిన్న మరమ్మతులు, మరుగుదొడ్లు, మూత్రశాలల అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
బండరాళ్ల తొలగింపునకు ప్రతిపాదనలు పంపించాం : హెచ్ఎం రమేశ్
పాఠశాల ముందున్న పెద్ద సమస్య బండరాళ్లు. మన ఊరు-మన బడిలో భాగంగా పాఠశాల ముందున్న బండరాళ్లను తొలగించాలంటూ ఉన్నతాధికారులకు ఇప్పటికే ప్రతిపాదనలు పెట్టాం. త్వరలో మంజూరు చేస్తారని ఆశిస్తున్నాం. ప్రసుత్తం 10 గదులున్నాయి. ఇంకా 3 గదులు కావాల్సి ఉంది. లైబ్రరీ, హెచ్ఎం, సైన్స్ గదుల కోసం కూడా ప్రతిపాదనలు చేశాం. మొదటి విడుతలో పాఠశాలకు డైనింగ్ హాల్, మరుగుదొడ్లు, మూత్రశాలు, మరమ్మతుల పనులు మంజూరయ్యాయి.